30 July, 2026 | 7:36 PM

మానవ అక్రమ రవాణాపై విద్యార్థులకు అవగాహన సదస్సు

30-07-2026 07:04 PM

మొగుళ్లపల్లి గురుకుల పాఠశాలలో కార్యక్రమం

భూపాలపల్లి/మొగుళ్లపల్లి,(విజయక్రాంతి): మానవ అక్రమ రవాణా నివారణతో పాటు బాలల హక్కుల పరిరక్షణపై విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి ఆదేశాలతో మొగుళ్లపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాలలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శారద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, సఖి వన్‌స్టాప్ సెంటర్, పోలీసు శాఖ అధికారులు విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

డీసీపీయూ ప్రతినిధి రాజకుమారయ్య మాట్లాడుతూ ప్రతి చిన్నారికి రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, పాఠశాల మానివేత, బాలలపై హింస, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై వివరించారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా అధికారులను సంప్రదించాలని సూచించారు. సఖి వన్‌స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గాయత్రి మాట్లాడుతూ... మహిళల పట్ల గౌరవ భావన పెంపొందించుకోవాలని, సైబర్ మోసాలు, వేధింపులపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ తిరుపతి 1098 సేవల ప్రాధాన్యతను వివరించారు.

అత్యవసర పరిస్థితుల్లో 1098, 181, 112, 100, 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆరుణదేవి, ఏఎస్‌ఐ గోపాల్, కానిస్టేబుల్ అరుణ్‌కుమార్, డీహెచ్‌ఈడబ్ల్యూ మమత, సోషల్ వర్కర్ లింగారావు, హెడ్ కానిస్టేబుల్ చంద్రమౌళి, కానిస్టేబుల్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.