దోమకొండలో విత్తనోత్పత్తిపై అవగాహన సదస్సు
ప్రైవేట్ విత్తన కంపెనీలపై ఆధారపడొద్దు : సహకార సంఘం చైర్మన్ అనంతరెడ్డి
దోమకొండ,(విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడంతో పాటు రైతులే విత్తనోత్పత్తి చేసుకునేలా ప్రోత్సహించేందుకు విత్తనోత్పత్తిపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం దోమకొండలో నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం(Professor Jayashankar Telangana Agricultural University), నాబార్డ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో విత్తనోత్పత్తిని ప్రోత్సహించేందుకు మూడు సహకార సంఘాలను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ప్రాథమిక సహకార సంఘాల సభ్యులు, విత్తనోత్పత్తి రైతులకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం(Telangana Farmer Knowledge Center), మాలుతుమ్మెద ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా కేంద్రం శాస్త్రవేత్త డా. జె.కె. రేవంత్ నాథన్(Central Scientist Dr. J.K. Revanth Nathan) మాట్లాడుతూ ఫౌండేషన్ విత్తనాలను ఉపయోగించడం ద్వారా 10 నుంచి 15 శాతం వరకు దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 90 నుంచి 95 శాతం వరకు వరి విత్తనాల మార్కెట్ ప్రైవేట్ సంస్థల ఆధిపత్యంలో ఉందని, దీంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. దీనిని తగ్గించేందుకు రైతులే నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసుకునేలా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.ప్రతి సహకార సంఘం పరిధిలో ఐదు ఎకరాల్లో సాగు చేసేందుకు ఐదుగురు రైతులకు కేఎన్ఎం-1638 సన్న రకం బ్రీడర్ సీడ్ అందజేసినట్లు తెలిపారు. ఈ రకం 120–130 రోజుల్లో కోతకు వస్తుందని, ఉల్లికోడు, అగ్గి తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుందని వివరించారు. రైతులు పండించిన ధాన్యాన్ని సహకార సంఘాలు కొనుగోలు చేసి, ప్రాసెసింగ్ అనంతరం ఫౌండేషన్ ట్యాగ్‌తో నాణ్యమైన విత్తనాలుగా రైతులకు అందజేస్తాయని చెప్పారు. విత్తన ప్రాసెసింగ్, బ్యాగులు, రవాణా తదితర ఖర్చులు పోను సహకార సంఘాలకు ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు.
సీడ్ సర్టిఫికేషన్ అధికారి నగేష్ మాట్లాడుతూ విత్తనోత్పత్తి సమయంలో బెరుకులు (ఇతర రకాల మొక్కలు) లేకుండా ఎప్పటికప్పుడు ఏరివేయాలని, రైతులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. పూత దశ, కోత సమయంలో అధికారులు పొలాలను సందర్శించి బెరుకులను గుర్తించే విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. కోత, ప్రాసెసింగ్ దశల్లోనూ పర్యవేక్షణ ఉంటుందని వివరించారు.సహకార సంఘం చైర్మన్ అనంత్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు విత్తనోత్పత్తి చేపట్టడం ద్వారా లాభాలు పొందడంతో పాటు నాణ్యమైన విత్తనాల కొరతను అధిగమించవచ్చన్నారు. రైతులు ప్రైవేట్ కంపెనీల విత్తనాలపై పూర్తిగా ఆధారపడకుండా స్వయంగా నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసుకునే దిశగా ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దోమకొండ సహకార సంఘం సీఈవో నవీన్, ఏఈవో కృష్ణారెడ్డి, సహకార సంఘం సభ్యులు, విత్తనోత్పత్తి రైతులు పాల్గొన్నారు.