ప్రభుత్వ సంస్థలు నెలకొల్పిన ప్రైవేటు బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్
దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత రిజర్వ్ బ్యాంక్ నుంచి లైసెన్సులు పొందిన నవతరం బ్యాంక్‌ల్లో యాక్సిస్ బ్యాంక్ ఒకటి. యాక్సిస్ బ్యాంక్‌ను యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (యూటీఐ), ఎల్‌ఐసీ, జీఐసీ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ తదితర ప్రభుత్వ సంస్థలు కలిసి నెలకొల్పాయి.
యూటీఐ బ్యాంక్ పేరుతో ప్రారంభం
ఈ బ్యాంక్‌ను స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థల్లో యూటీఐకి అధికవాటా (23.5 శాతం) ఉన్నందున, ఇప్పటి యాక్సిస్ బ్యాంక్‌ను మూడు దశాబ్దాల క్రితం 1993లో యూటీఐ బ్యాంక్ పేరుతో ముంబై ప్రధాన కేంద్రంగా నెలకొల్పారు. బ్యాంక్ తొలి శాఖను అహ్మదాబాద్‌లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 1994 ఏప్రిల్‌లో ప్రారంభించారు. 1997లో తొలి పబ్లిక్ ఇష్యూ జారీచేసిన యూటీఐ బ్యాంక్ దేశీయ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయ్యింది.
15.18 లక్షల కోట్ల ఆస్తులు
యాక్సిస్ బ్యాంక్‌కు 2024 మార్చినాటికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం 5,377 శాఖలు ఉ న్నాయి. 2024 మార్చి 31నాటికి ఈ బ్యాంక్‌లో 1,04,33 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ ఆస్తు ల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ.15.18 లక్షల కోట్లు. ఆస్తుల రీత్యా ప్రైవేటు బ్యాంక్‌ల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల తర్వాత యాక్సిస్ బ్యాంక్ తృతీయస్థానంలో నిలిచింది. యాక్సిస్ బ్యాంక్‌కు ప్రస్తుతం అమితాబ్ చౌధరిఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
రూ.3.55 లక్షల కోట్ల మార్కెట్ విలువ
స్టాక్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడయ్యే యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.3,55,330 కోట్లు.
యాక్సిస్ బ్యాంక్‌గా పేరు మార్పు
యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సంక్షోభంలో చిక్కుకోవడంతో ప్రభుత్వం దానిని మూసివేసి, యూనిట్లలో ఇన్వెస్ట్‌చేసినవారికి చెల్లింపులు జరిపింది. యూటీఐ వద్ద వున్న యూటీఐ బ్యాంక్ వాటాను స్పెషల్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూటీఐ (ఎస్‌యూ యూటీఐ)కి 2003లో బదిలీ చేసింది. ఆపై యూటీఐ బ్యాంక్ పేరును 2007 జూలైలో యాక్సిస్ బ్యాంక్‌గా మార్చారు.
తదుపరి కాలంలో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ఎస్‌యూయూటీఐలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ వాటాను చాలావరకూ విక్రయించింది. దానితో ఇతర ప్రైవేటు బ్యాంక్‌ల్లానే యాక్సిస్ బ్యాంక్‌లో కూడా ప్రస్తుతం మెజారిటీ 51 శాతం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల చెంత ఉన్నది. దేశీయ సంస్థల్లో ఎల్‌ఐసీకి 8.29 శాతం, ఇతర సంస్థలు, ఫండ్స్ వద్ద 33.2 శాతం వాటా ఉన్నది.




