11 April, 2026 | 12:30 AM

ధనికులపై భారత్ అధిక పన్నులు విధించాలి

14-12-2024 11:58 PM

ఫ్రాన్స్ ఆర్థికవేత్త థామస్ పికెట్టీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: భారత్‌లో నెలకొన్న భారీ ఆర్థిక అసమానతల కారణంగా శ్రీమంతులపై పన్నుల్ని పెంచాలని ఫ్రాన్స్ ఆర్థికవేత్త థామస్ పికెట్టీ సూచించారు. ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ నిర్వహించిన ఒక సదస్సులో పికెట్టీ మాట్లాడుతూ సంపద పన్ను, వారసత్వ పన్నుల ద్వారా ప్రభుత్వానికి అధికాదాయం లభిస్తుందని చెప్పారు.

1.18 మిలియన్ డాలర్లను (రూ.10 కోట్లు) మించి ఆదాయం కలిగిన సంపన్నులపై 2 శాతం సంపద పన్ను, 33 శాతం వారసత్వ పన్ను విధిస్తే జీడీపీలో 2.73 శాతం మేర అధిక ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుందని బెస్ట్ సెల్లింగ్ బుక్ ‘క్యాపిటల్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ రచయిత అయిన పికెట్టీ అంచనా వేశారు. జాతీయాదాయంలో 1 శాతం భారత శ్రీమంతులు ఆదాయం నిష్పత్తి యూఎస్, బ్రెజిల్ దేశాల్ని మించి ఉందంటూ వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ ప్రచురించిన పుస్తకంలో అంశాల్ని ఆయన ఉటంకిస్తూ భారత్ జనాభాలో కేవలం 1 శాతంమంది చేతుల్లో 22.6 శాతం జాతీయ ఆదాయం, 40.1 శాతం జాతీయ సంపద ఉన్నదని వివరించారు. అదే సదస్సులో కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ పికెట్టీ పిలుపును వ్యతిరేకించారు.