నేను తగినదాన్ని కాదు!
నటన, గానం, సంగీత దర్శకత్వం వంటి వాటితో బహుముఖ ప్రజ్ఞావంతురాలిగా పేరొందారు శృతిహాసన్. అయితే ఒక్క విషయంలో మాత్రం అందుకు నేను తగిన వ్యక్తిని కాదంటూ తేల్చి చెప్పారు. విషయానికొస్తే.. కమల్ హాసన్ బయోపిక్ తీయాల్సి వస్తే ఆ చిత్రానికి మీరు దర్శకత్వం వహించే అవకాశముందా? అనే ప్రశ్న ఇటీవల శృతికి ఎదురైంది. దీనిపై ఆమె స్పందిస్తూ “దర్శకత్వం అనేది చాలా పెద్ద బాధ్యత. ఎన్నో విభాగాలను కలుపుకుంటూ చేయాల్సి ఉంటుంది.
నాన్న కథ ఎందరికో స్ఫూర్తినిచ్చేదే అయినా దానికి నేను దర్శకత్వం వహించలేను. పరిశ్రమలో ఎందరో మేటి దర్శకులు ఉన్నారు. వాళ్ళయితే ఇంకా అద్భుతంగా ఈ సినిమా చేయగలరు. ఒకవేళ నేను తీస్తే అది పక్షిపాతంగా ఉంటుందేమో” అంటూ సున్నితంగా బదులిచ్చారామె. గతేడాది ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’, ‘సలార్ : సీజ్ ఫైర్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్, ప్రస్తుతం ‘డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ’, ‘సలార్: శౌర్యంగ పర్వం’, ‘చెన్నై స్టోరీ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.






