9 April, 2026 | 8:25 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

షాద్‌నగర్‌లో ఘోరం

29-06-2024 12:31 AM

గ్లాస్ పరిశ్రమలో పేలిన రియాక్టర్.. ఐదుగురు మృతి

  1. ఇనుపచువ్వలు, గ్లాస్ ముక్కలు గుచ్చుకుని సుమారు 15 మందికి తీవ్ర గాయాలు
  2. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం చింతగూడలో ఘటన

రంగారెడ్డి, జూన్ 28 (విజయక్రాంతి): గ్లాస్ పరిశ్రమలో రియాక్టర్ విస్ఫోటనం చెంది ఐదుగురు కార్మికులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి ఇనుప చువ్వలు, గ్లాస్ ముక్కలు గుచ్చుకుని సుమారు 15 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలంలోని చింతగూడ శివారులోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశ్రమలో ప్రతిరోజు షిఫ్టుల వారీగా 150 నుంచి 180 మంది వరకు పనిచేస్తారు. 

వీరిలో ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వలస వచ్చినవారే ఎక్కువ. శుక్రవారం రోజులాగానే కార్మికులు విధులకు హాజరయ్యారు. కార్మికులు సిద్ధం చేసిన అద్దాలను క్వాలిటీ కంట్రోల్ విభాగంలోకి పంపించారు. అక్కడ నిపుణులు ఆటోమేటిక్ యంత్రాల ద్వారా అద్దాల నాణ్యతను అంచనా వేస్తుండగా, రసాయన ప్రక్రియ జరిగి రియాక్టర్ వ్యాకోచించి పేలుడు సంభవించింది. ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సుమారు 15 మంది గాయపడ్డారు. కొందరి అవయవాలు వారి శరీరాల నుంచి విడిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయి. క్షతగాత్రులు రక్తపు మడుగులో పడిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి.

తోటి కార్మికులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో షాద్‌నగర్, శంషాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానలకు తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా.. మృతులు, క్షతగాత్రుల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మృతులను ఉత్తరప్రదేశ్ కు చెందిన నికిత్ కుమార్ (22) రామ్‌సేతు (24), బీహార్ కు చెందిన రాం ప్రకాష్, (31), చిత్తరంజన్ దాస్ (31)  ఒడిశాకు చెందిన రతికాంత్ (25)గా గుర్తించినట్లు ఆర్డీవో వెంకట మాధవరావు తెలిపారు. పేలుడు ఘటనపై పూర్తిస్థాయి విచారణ పూర్తి చేపడుతున్నామని, ఆ తర్వాత ఇతర వివరాలు వెల్లడిస్తామన్నారు. 

సీఎం దిగ్భ్రాంతి..

పేలుడు ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి  ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు చేపట్టాలని కలెక్టర్ శశాంకను ఆదేశించారు. కలెక్టర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని డీసీపీ రాజేష్, అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతిచెందిన, గాయపడిన కార్మికుల కుటుంబాల వివరాలు సేకరించారు. పరిశ్రమ యాజమా న్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ప్రమాదం సంభవించిందని మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహా, కార్మిక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

రియాక్టర్ పేలిన ఘటనలో మృతిచెందిన ఐదుగురి కుటుంబాలను రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబాలకు నిలవాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు

పేలుడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా నిలవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని యాజమాన్యాలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు.

ఆరుగురు మృతి బాధాకరం: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు మృతిచెందడం బాధకరమని, రాష్ట్రప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరారు. గాయప డిన వారికి మెరుగైన వైద్యం సేవలందించాలన్నారు. భవిష్యత్తులో ఇప్పటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఎంపీ డీకే అరుణ ఆరా..

ప్రమాద ఘటనపై మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీసీపీ రాజేష్‌తో ఫోన్లో మాట్లాడి ఘటనకు కారణాలపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలను  కంపెనీ యజమాన్యంతో పాటు రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. పరిశ్రమలో లోపాలను గుర్తిస్తే, కేంద్రం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.