కమిషన్ నివేదిక ఇస్తే తప్పేంటి?
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టు సూటి ప్రశ్న
నర్సింహారెడ్డి కమిషన్ ఇచ్చేది నిజనిర్ధారణ నివేదికే కదా?
ఈ కమిషన్ నివేదికకు కట్టుబడి ఉండాలనేమీ లేదుకదా?
కేసీఆర్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఎంవోయూలు, థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణ జరిపి నివేదిక ఇస్తే తప్పేంటని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును హైకోర్టు ప్రశ్నించింది. విచారణ కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేనప్పడు నిజనిర్ధారణ నివేదిక ఇస్తే తప్పు ఏముందని నిలదీసింది. జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దుచేయాలని కోరుతూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా? వద్దా? అన్న అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటితో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం వాదనలు విన్నది.
ఈ సందర్భంగా పిటిషనర్‌కు పలు ప్రశ్నలు సంధించింది. ‘కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేనప్పుడు అది ఏం చెబితే ఏమిటి? కమిషన్ సమర్పించే నివేదికకు కట్టబడి ఉండాలని లేదు కదా? నిజనిర్ధారణ నివేదికను మాత్రమే ఇస్తుంది. అలాంటప్పుడు కమిషన్ విచారణపై అభ్యంతరం ఎందుకు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఏపీ ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో హైకోర్టు/సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్ ఉదహరించారు. ఆ తీర్పు ప్రభుత్వ వాదనలకు అనుకూలంగా ఉన్నదని చెప్తున్నందున దానిని ఇప్పుడు మీరు సమర్ధిస్తారా?’ అని ప్రశ్నించింది. అందుకు పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వొకేట్ ఆదిత్య సోంధి జవాబు చెప్పలేదు.
పిటిషన్‌కు విచారణార్హత లేదు
కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌కు అసలు విచారణార్హతే లేదని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదించారు. ‘నర్సింహారెడ్డి కమిషన్ ఎక్కడా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదు. నిష్పక్షపాతంగా విచారణ చేస్తోంది. కేసీఆర్ వేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతించవద్దు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు వ్యవహారాలు.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ పీపీఏలు, ఎంవోయూ) చేసుకోవడంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ 1952 ప్రకారం జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్‌ను గత మార్చి 14న నియమించింది.
ఇప్పటివరకు సుమారు ౨౦ మంది సాక్షులను విచారించింది. అందులో ట్రాన్స్‌కో, జెన్‌కో మాజీ సీఎండీ ప్రభాకర్‌రావుతోపాటు ఆ సంస్థల ఉన్నత స్థాయి అధికారులున్నారు. కేసీఆర్‌కు గత ఏప్రిల్‌లోనే నోటీసులు ఇస్తే లోక్‌సభ ఎన్నికల ప్రచారం పేరుతో వాయిదా కోరారు. కమిషన్ గడువు జూన్ 30 వరకే ఉండటంతో జూన్ 15న వివరాలు తెలియజేయాలని కమిషన్ కోరింది. వివరాలు ఎవరి ద్వారా అయినా పంపినా లేక స్వయంగా కేసీఆర్ చెప్తామన్నా అందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయం తెలుపుతూ కమిషన్ అత్యంత గౌరవప్రదంగా లేఖ రాసింది. అయినా కేసీఆర్ నుంచి స్పందన లేదు. గతంలోనూ కమిషన్లు మీడియాకు వివరాలు వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి.
ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ కమిషన్. గోప్యత ఏమీ లేదు. కేసీఆర్‌కు 8బీ నోటీసులు ఇవ్వడం తప్పుకాదు. విద్యుత్ వ్యవహారాలపై విచారణకు రెడీ అని స్వయంగా నాటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రతిపక్ష సభ్యుడిగా అసెంబ్లీ సమావేశాల్లో నిండు సభలో చెప్పారు. అందువల్ల కేసీఆర్ పిటిషన్‌ను కొట్టేయండి’ అని హైకోర్టును కోరారు. పిటిషన్‌కు విచారణార్హత లేదని, హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన జస్టిస్ నర్సింహారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీచేసే పరిస్థితులు రాకూడదని ఏజీ విన్నవించారు. ఈ సమయంలో కల్పించుకున్న చీఫ్ జస్టిస్ అరాధే.. జస్టిస్ నర్సింహారెడ్డికి నోటీసులు జారీచేసే వరకు వెళ్లవద్దని, పిటిషన్ లోతుపాతులపై మాత్రమే విచారిస్తున్నామని చెప్పారు.
ఇరుపక్షాల వాదనల తర్వాత తగిన ఉత్తర్వులు ఇస్తామని, ఇప్పుడే ఏమీ ఉత్తర్వులు ఇవ్వడం లేదని స్పష్టంచేశారు. అనంతరం ఏజీ వాదిస్తూ కమిషన్ విచారణ నివేదికను మాత్రమే ఇస్తుందని, న్యాయపరమైన ప్రక్రియ చేపట్టదని తెలిపారు. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడంలో తప్పు లేదని వాదించారు. ఫలానా వాళ్లు తప్పు చేశారని కమిషన్ చెప్పలేదని పేర్కొన్నారు. పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదని స్పష్టంచేశారు. కమిషన్‌పై నిరాధార ఆరోపణలు చేసి విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోర్టును ఏజీ కోరారు. వాదనల తర్వాత ఇరు పక్షాలు చెప్పిన కోర్టుల తీర్పుల కాపీలను తనకు అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. పిటిషన్‌ను విచారణకు అనుమతించాలో లేదో (శుక్రవారం) లేదా సోమవారం (జూలై 1) తీర్పు చెబుతామని వెల్లడించింది. (వార్త పబ్లిష్ చేసే సమయానికి కోర్టు నిర్ణయం వెలువడలేదు).
విచారణ నిష్పక్షపాతంగా లేదు
ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా లేదని కేసీఆర్ తరఫు న్యాయవాది వాదించారు. కమిషన్ పిటిషనర్‌కు నోటీసులు ఇచ్చిందని, పిటిషనర్ విచారణకు హాజరు అవ్వడానికి ముందే జస్టిస్ నర్సింహారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో వినియోగించిన టెక్నాలజీ వల్ల ప్రభుత్వానికి ఇప్పటికే రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు నష్టం వచ్చిందని చెప్పడం ద్వారా తన నిజ రూపాన్ని బట్టబయలు చేశారని ఆరోపించారు. దీనిని బట్టి కమిషన్ తుది నివేదిక ఏ విధంగా ఇస్తుందో అర్ధం చేసుకోవచ్చునని చెప్పారు. విచారణ కమిషన్ ఏర్పాటు జీవో చట్టబద్ధంగా లేదని తెలిపారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌ఏఎం రిజ్వీ గత మార్చి 14న కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ 1952 ప్రకారం జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో 9 జారీ చేసిందని, ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించేందుకు వీల్లేదని వాదించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం కింద జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానిని జ్యుడీషియల్ కమిషన్‌గా పరిగణించేందుకు వీల్లేదని పేర్కొన్నారు. కమిషన్ ఏర్పాటు జీవో అమలును నిలుపుదల చేయాలని కోరారు.




