11 August, 2026 | 2:05 AM

అక్కెనపల్లి పెద్దవాగులో ఇసుక మాయం

11-08-2026 12:51 AM
  1. అడుగంటుతున్న భూగర్భ జలాలు!
  2. ట్రాక్టర్‌కు రూ.20 వేలు వసూలు 
  3. మామూళ్లకు అధికారుల మౌనం 
  4. మంత్రికి చెప్పిన సిద్దిపేట ఎమ్మెల్యే
  5. ఆందోళనలో రైతులు

సిద్దిపేట, ఆగస్టు 10 (విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి పెద్దవాగు లో రాత్రి, పగలు ఇసుకను తోడేస్తున్నారు.  ప్రజలు, రైతుల నుంచి ఆందోళనలు వ్యక్తం అవుతున్న అధికారులు చేతులు తడుపుకుని అక్రమార్జనకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.

ప్రజా ప్రతినిధుల నుంచి సైతం అధికారుల పనితీరును తప్పుపడుతున్న అనుమతుల పేరుతో కాలం గడుపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మండలంలో రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులకు మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నారని చర్చ జరుగుతోంది. 

ట్రాక్టర్‌కు రూ.20 వేలు.. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 

ట్రాక్టర్ యజమానుల నుంచి ఒక్కో వాహనానికి రూ. 20వేల చొప్పున వసూలు చేసి, స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులకు ముట్టజెబుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారుల అండదండలతోనే పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, ప్రభుత్వ పనుల పేరుతో అనుమతులు తీసుకుని, వ్యాపారులు యథేచ్ఛగా అక్రమ రవాణా కు పాల్పడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అడుగంటుతున్న భూగర్భ జలాలు... 

పెద్దవాగులో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు తీవ్రంగా అడుగంటుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బోరు బావులలో నీరు పడిపోయినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తాగు, సాగునీటి తీవ్ర సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నా గనులు, రెవెన్యూ, పోలీస్ శాఖలు పరస్పరం బాధ్యతలు తప్పించుకుంటున్నాయి.

భారీగా ఇసుక డంపింగ్...

వాగు అవతల గ్రామంలో కలిపి సుమారు 500 ట్రిప్పుల కూ పైగా ఇసుక డంపింగ్ ఉన్నట్లు సమాచారం. ఇంత భారీ ఎత్తున నిల్వలు ఉన్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటం పై రెవెన్యూ, పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హరీశ్‌రావు ప్రస్తావన.. 

ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో (డి డి ఆర్ సి) ఇసుక అక్రమ రవాణా అంశాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే  హరీశ్రావు జిల్లా ఇన్చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాలేదనీ ఇందులో అధికార పార్టీ నాయకుల చేతివాటం ఉందా అనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందన శూన్యమని రైతులు వాపోతున్నారు.

అక్కెనపల్లి పెద్దవాగు పరీవాహక ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలనీ, సహజ సంపదను ధ్వంసం చేస్తున్న మాఫియాపై, వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

సమాచారం ఇస్తే సీజ్ చేస్తాం.. సదానందం, సిద్దిపేట ఆర్‌డీవో

 అక్కేనపల్లి పెద్దవాగులో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం ఆన్లైన్ లో అనుమతులు తీసుకున్నవారికి మాత్రమే ఇసుక రవాణాకు అవకాశం ఉంది. అక్రమ ఇసుక రవాణా జరగకుండా తహసిల్దార్ పర్యవేక్షణలో పోలీసు, జీపీవోలను ప్రత్యేకంగా నియమించి నిఘా ఏర్పాటు చేశాం.

అక్రమంగా ఇసుకు రవాణా జరిగిన, ఇసుక డంపులు ఉన్న, ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం వద్ద కాకుండా ఇతర నిర్మాణాల వద్ద ఇసుక అన్లోడ్ చేస్తున్నట్లు సమాచారం ఇస్తే వెంటనే సీజ్ చేస్తాం. అధికారులకు మామూళ్లు ఇవ్వడం, ఎవరైనా వసూలు చేసిన కఠినచర్యలు తీసుకుంటాం.