16 July, 2026 | 10:59 PM

బాలయ్య డబుల్ ధమాకా

11-06-2024 12:20 AM

అసురుడి ఆగమనం

నందమూరి బాలకృష్ణ జన్మదిన (జూన్ 10) సందర్భంగా సోమవారం నాడు ఆయనకు సంబంధించిన రెండు సినిమాల సమాచారాన్ని అభిమానుల ముందుకు తీసుకొచ్చాయి చిత్ర వర్గాలు. బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా నుండి ప్రత్యేకంగా ఒక టీజర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఇందులో “జాలి, దయ, కరుణ లాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు”గా బాలకృష్ణ శక్తివంతమైన పాత్రలో కనపడనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి థమన్ స్వరాలు అందిస్తున్నారు.

మరోసారి బాలయ్య-బోయపాటి

బాలయ్య - బోయపాటి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు ఘన విజయాలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరి కలయికలో నాల్గవ చిత్రం రూపుదిద్దుకోనున్నట్టు గత కొంతకాలంగా వినవస్తున్న వార్తలను నిజం చేస్తూ  14 రీల్స్ ప్లస్ సంస్థ నుండి ఓ ప్రకటన వెలువడింది. ఈ సినిమాతో బాలయ్య కుమార్తె సినీ రంగ ప్రవేశం చేయనుండటం విశేషం.

రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించనున్న ఈ సినిమాకి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు. అయితే ఇది ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా రానుందా లేదా అన్న విషయమై 14 రీల్స్ నుండి స్పష్టత రావాల్సి వుంది. నందమూరి బాలకృష్ణ యాభై ఏళ్ళ సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో అట్టహాసంగా ఈ సినిమా ఆరంభ వేడుకలు జరుగనున్నట్టు సమాచారం.