16 July, 2026 | 10:37 PM

బోర్సేకి బోలెడు అవకాశాలు

11-06-2024 12:20 AM

‘మిస్టర్ బచ్చన్’తో తెలుగు వారికి పరిచయం కానున్నారు కథానాయిక భాగ్యశ్రీ బోర్సే. తెలుగులో ఆమె నటించిన సినిమా ఒక్కటంటే ఒక్కటీ బయటకు వచ్చింది లేదు. అయినప్పటికీ బోలెడు అవకాశాలని అందుకుని తోటి హీరోయిన్లకు షాక్ ఇస్తోంది ఈ అమ్మడు. ప్రస్తుతం రవితేజతో ఆడిపాడితోన్న బోర్సె, విజయ్ దేవరకొండ సినిమాలోనూ నాయికగా కనపడనుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపికచేశారు. ఈ విషయాన్ని నిర్మాణ వర్గాలు ప్రకటించాల్సి ఉంది.

ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే మరో కొత్త కబురు చెప్పిందీ కథానాయిక. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా ‘దసరా’ చిత్ర నిర్మాత చెరుకూరి సుధాకర్ ఓ సినిమా చేయనున్నారు. ‘సీతారామం’ తరహా ప్రేమకథా చిత్రంగా రానున్న ఈ సినిమాతో పరశురామ్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రవి దర్శకుడిగా పరిచయం కానున్నారు. కాగా ఈ సినిమాలో దుల్కర్ సరసన నాయికగా భాగ్యశ్రీని ఖాయం చేశారు చిత్ర దర్శక నిర్మాతలు. దర్శకుడు చెప్పిన కథ ఎంతగానో నచ్చడంతో  విన్న వెంటనే ఈ సినిమాలో నటించాలని నిర్ణయం తీసుకుందట. పాన్ ఇండియా సినిమాగా రానున్న ఈ సినిమా చిత్రీకరణ సగభాగం వరకు అమెరికాలో జరుగనుండగా, మిగతా సగం భారత్‌లోనే జరుగనుంది.