16 July, 2026 | 11:21 PM

మరో ప్రపంచం వస్తోంది!

11-06-2024 12:05 AM

భూమి మీద మొట్ట మొదటి నగరమది. అలాంటి నగరంలో ఉన్న వనరులన్నీ మరో ప్రపంచంలోని వారు పీల్చేస్తుండటంతో అక్కడ జీవం ఉనికే ప్రశ్నార్థకమైంది. ఈ పరిస్థితుల్లో అక్కడ మరో సృష్టికి ఆరంభం కానుండగా, దాన్ని అడ్డుకునేందుకు ఓ భీకర యుద్ధం మొదలైంది. ఇంత దారుణాలకి కారకులైన ఆ ప్రపంచంలో ఉన్నదెవరు? జరిగే సృష్టిని వారు అడ్డుకోగలిగారా లేదా అన్న ప్రశ్నలకు జూన్ 27న “కల్కి 2898 ఏడీ” చిత్రం సమాధానం ఇవ్వనుంది. భారతీయ పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్సన్ జానర్‌లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది.

మూడు నిమిషాల వ్యవధి గల ఈ ట్రైలర్ ప్రధానంగా యాక్షన్ ఘట్టాలతో సాగింది. సృష్టి రక్షణ కోసం అశ్వత్థామగా అమితాబ్ చేసిన పోరాటాలు ప్రధాన ఆకర్షణగా నిలవగా, “రికార్డ్స్ చూసుకో. ఇంత వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను” అంటూ భైరవగా ప్రభాస్ విసిరిన సవాలు అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. మరో ప్రధాన పాత్రధారి అయిన దీపిక పదుకుణె “ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకోని ఈ బిడ్డ కోసం ఎంతమంది చనిపోవాలి” అంటూ సొంత గొంతకను వినిపించారు.

రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శోభన, దిశా పటానీ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో “భయపడకు.. మరో ప్రపంచం వస్తోంది” అంటూ ప్రతినాయకుడిగా అందరినీ భయపెట్టారు కమల్ హాసన్. ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన ఈ సినిమాలోని విజువల్స్ తెలుగు ప్రేక్షకులు ‘ఔరా’ అనేలా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రేక్షకులను సైతం అబ్బురపరిచే విధంగా వైజయంతి మూవీస్ నిర్మించిన ‘కల్కి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న విడుదల కానుంది.