4 September, 2026 | 8:50 PM

బిసి మంత్రిని తొలగించడం బీసీలను అణచివేయడమే

04-09-2026 | 07:43pm

ఉట్నూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం(Telangana State Cabinet) నుండి బీసీ బిడ్డ కొండా సురేఖను మంత్రి నుండి బర్తరఫ్ చేయడం రాజకీయంగా బీసీలను అణచివేతేనని బీసీ సంఘం ఉట్నూర్ మండల అధ్యక్షులు శ్రీపతి లింగ గౌడ్ అన్నారు. శుక్రవారం ఉట్నూరు మండల కేంద్రం  లోని ప్రెస్ భవన్‌లో ఉట్నూరు మండల(Utnur Mandal) బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ మండల కన్వీనర్ సిపతి లింగాగౌడ్ మాట్లాడుతూ, బీసీ బిడ్డను కొండా సురేఖ(Konda Surekha)ను మంత్రి పదవి నుంచి తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) బీసీలను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.బీసీ బిడ్డలు రాజకీయంగా, విద్యాపరంగా, అన్ని రంగాల్లో ముందుకు వస్తున్న ప్రస్తుత సమయంలో వారిని ప్రోత్సహించాల్సింది పోయి పదవుల నుంచి తొలగించడం బీసీ సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. కొండా సురేఖ కుటుంబం ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిందని, అలాంటి కుటుంబానికి చెందిన ఒక బీసీ మహిళను మంత్రి పదవి నుంచి తొలగించడం వెనుక బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా చేసే కుట్ర ఉందని లింగాగౌడ్ ఆరోపించారు.

కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తి గత అభిప్రాయాలేనని చెప్పినప్పటికీ, వాటికి కొండా సురేఖను బాధ్యురాలిగా చేస్తూ మంత్రి పదవి నుంచి తొలగించడం సమంజసం కాదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడికి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే, విమర్శించే హక్కు ఉందని పేర్కొన్నారు.“బీసీలను అణగదొక్కే ప్రయత్నాలను ఇక సహించేది లేదనీ అన్నారు. బీసీలపై ఏ పార్టీ ప్రభుత్వం అయినా ఇలాంటి చర్యలకు పాల్పడితే రాబోయే రోజుల్లో బీసీ సమాజం ఐక్యంగా ఉద్యమిస్తుందని లింగాగౌడ్ హెచ్చరించారు. ఉట్నూరు మండలంలోని బీసీ సంఘాలన్నీ ఐక్యంగా నిలిచి బీసీల హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.