బీసీ రక్షణ చట్టం తేవాలి
సంఘం జాతీయ అధ్యక్షుడులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య lముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో బీసీ నేతలు చర్చలు
ముషీరాబాద్,మార్చి 23(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ మాదిరిగా మన రాష్ట్రంలో కూడా బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీ చాంబర్‌లో సోమవారం కలిసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య చర్చలు జరిపారు. ఈ సందర్బంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల రక్షణ చట్టం తయారు చేసిందన్నారు.
అసెంబ్లీ పాస్ చేయడానికి సన్నాహాలు చేస్తుందని, ఇది బీసీల చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్నారు. చాలా ఏళ్లుగా బీసీలు తమకు ఎస్సీ, ఎస్టీ మాదిరిగా ’బీసీ రక్షణ చట్టం’ కావాలని కోరుతున్నారని అన్నారు. బీసీ కులాలలో చాలా కులాలు ఇప్పటికే అత్యంత వెనుకబడిన కులాలు, సంచార జాతులు, భిక్షాటన చేసే కులాలు ఉన్నాయని, వీరిని సమాజంలో తక్కువ చూపు చూస్తూ, కులాల పేరు మీద హీనంగా పిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి అందుకే సమాజంలో గౌరవం పెంచవలసిన అవసరం ఉంద ని అన్నారు. దాడులకు, దౌర్జన్యాలకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉందన్నారు.
ఈ చట్టం తేవడంతో బీసీ లలో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని సీఎంకు వివరించినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఈ అసెంబ్లీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే ‘బీసీ రక్షణ చట్టం’ తీసుకొని వస్తామని, త్వరలో అధికారులతో చర్చించి బిల్లు పెడతామని హామీ ఇచ్చినట్లు బీసీ నేతలు తెలిపారు. ఈ చర్చలలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజి, బీసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పగిళ్ళ సతీష్, బీసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర కన్వీనర్ పర్లగోర్ల మోడీ రాందేవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




