6 April, 2026 | 8:21 PM

కళ్లెత్తి చూస్తే.. కనకాభిషేకమే!

02-12-2024 12:00 AM

షర్మిలా ఠాగూర్.. మూవీ లవర్స్‌కు పరిచయం అక్కరలేని పేరు. బాలీవుడ్‌లో సంచలనం. 60, 70 దశకాల్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఆమె నటనను చూసేందుకు అభిమానులు ఎగబడేవారు. సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూసేవారు. ఆమె నటిస్తే కాసులు వర్షం కురిసేది. ఏడు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమకు చేసిన సేవకుగానూ భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించిందామెను.

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మనవరాలైన షర్మిల ఠాగూర్.. 1959లో ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే తీసిన బెంగాలీ చిత్రం ‘అపూర్ సంసార్’లో మొదటిసారి నటించారు. 1960లో బెంగాలీ, హిందీ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా పేరు పొందింది. బాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ‘కాశ్మీర్ కి కలి’ సూపర్ హిట్ అయింది. తర్వాత వక్త్, దేవర్, నాయక్, యాన్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్, ఆరాధన, ఛోటీ బహు, అమర్ ప్రేమ్‌తో, మౌసమ్, దేవి, దాగ్, మిస్సిస్సిప్పి మసాలా, మన్, శుభో వంటి సినిమాలు అప్పట్లో కమర్షియల్ హిట్స్. 

1967లో శక్తి సామంత దర్శకత్వంలో విడుదలైన ‘యాన్ ఈవినింగ్ ఇన్ ప్యారిన్’ మూవీలో మొదటిసారి షర్మిల బికినీ ధరించింది. ఆ సన్నివేశంలో షర్మిల ధరించిన బికినీ గురించి అప్పట్లో పార్లమెంటులో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఆరాధన మూవీలో రాజేష్ ఖన్నా సరసన షర్మిల మరపురాని నటనతో ఆకట్టుకున్నారు. ఆరాధన దక్షిణ భారతదేశంలోని థియేటర్లలో మూడు సంవత్సరాలు ఆడిందంటే అర్థం చేసుకోవాలి.

ఆ సినిమా దేశవ్యాప్తంగా ప్లాటినం జూబ్లీ హిట్‌గా నిలిచింది. ఇలాంటి మరెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో షర్మిల నటించారు. ‘రూప్ తేరా మస్తానా.. మేరే సప్నోకి రాణి వంటి పాటలు కల్ట్ క్లాసిక్‌లుగా నేటికీ అలరిస్తున్నాయి. తాను ఏ హీరో సినిమాలో నటించినా తనను థియేటర్లలో వీక్షించేందుకు అభిమానులు ఎగబడేవారు. షర్మిల నటించిన చాలా సినిమాలు చిత్ర పరిశ్రమపై అనూహ్య ప్రభావాన్ని చూపాయి. రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, నసీరుద్దీన్ షా మొదలైన అగ్ర నటుల సరసన నటించింది. 

1975లో గుల్జార్ తీసిన మౌసమ్ చిత్రంలో షర్మిల నటనకు ఉత్తమ నటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కింది. 2003లో గౌతం ఘోస్ తీసిన అభర్ అరణ్యె అనే బెంగాలీ చిత్రంలోని నటనకు ఉత్తమ సహాయనటి పురస్కారం లభించింది. అలాగే సినీ ఇండస్ట్రీకి అందించిన సేవలకుగానూ ఫిలీంఫేర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు పొందింది. ప్రతిష్టాత్మక కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. 2005లో యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడార్‌గా ఎన్నుకున్నారు. అలాగే 2013లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. 

హీరోయిన్‌గా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడు అప్పటి స్టార్ క్రికెటర్ మన్సూర్ అలీఖాన్‌ను వివాహం చేసుకుంది. కాగా మన్సూర్ ముస్లిం కాగా షర్మిల హిందువు. దాంతో వీళ్ల పెళ్లిని షర్మిల కుటుంబ వ్యతిరేకించింది. దాంతో ఇంట్లోవాళ్లను ఎదురించి ఠాగూర్ మతం మారింది. ఇస్లాం స్వీకరించి బేగం అయేషా సుల్తానాగా మారి మన్సూర్ అలీఖాన్‌ను వివాహం చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత మన్సూర్ షర్మిలతో కలిసి పటౌడీ ప్యాలెస్‌కు వెళ్లారు.

ఆ బంగ్లాకు ఇన్‌ఛార్జ్‌గా షర్మిల బాధ్యతలు తీసుకున్నారు. అక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరికి సైఫ్ అలీఖాన్‌తోపాటు సబ, సోహ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. మన్సూర్ 2011లో మరణించడంతో చాలా రోజులు పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఆ బంగ్లా ధర అక్షరాల రూ. 800 కోట్లు. షర్మిల షూటింగ్ కోసం పటౌడీ ప్యాలెస్‌ను అద్దెకు కూడా ఇస్తుంది. రణబీర్ కపూర్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘యానిమల్’ సినిమాలో కనిపించేది ఇదే బంగ్లా. గతేడాది ‘గుల్మోహర్’ మూవీతో మళ్లీ కెమెరా ముందుకొచ్చారు షర్మిలా ఠాగూర్.