21 August, 2026 | 12:29 PM

ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేరుతో లబ్ధిదారుల్ని తికమక పెట్టదు

21-08-2026 11:54 AM

కొత్తగూడెం టౌన్, ఆగస్టు 21  (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ఎంపికలో కాలయాపన సరైనది కాదని సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్, ఆవాజ్ పట్టణ కార్యదర్శి జలాల్ విమర్శించారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో రెండో విడత పేరుతో ఇండ్ల సర్వేలు చేస్తుండడం బాధాకరమని, గతంలో లబ్ధిదారుల ఎంపికలు జరిగి విభాగాల వారీగా విభజించినా  ప్రజలను, లబ్ధిదారులను తికమక పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. L1, L2, L3  విభాగాలు ఉండగా మరలా ఎందుకు సర్వేల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మొదటి విడత ఎంపికలు జరిగి ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్న సంవత్సరం గడుస్తున్నప్పటికీ రెండో విడత ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా లబ్ధిదారులను గందరగోళ పర్చకుండా ఎంపికలు సజావుగా జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. వెన్నెల నగర్ వాసులకు మిగిలి ఉన్న 500 మంది లబ్ధిదారులకు ఈ విడుతలో ప్రాధాన్యత ఇచ్చి ఒకేసారి ఇండ్ల మంజూరు చేయాలని ఆయన కోరారు.