21 August, 2026 | 12:55 PM

అమెరికా పర్యటన కొనసాగించండి... అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

21-08-2026 11:51 AM
  1. నా పర్యటనకు రాజకీయ కోణంలోనే అనుమతి నిరాకరణ
  2. రాజకీయ కోణంలో పర్యటనను అడ్డుకోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది
  3. నా విదేశీ పర్యటన వికసిత్ భారత్ కు దోహదపడుతుందని భావించా

హైదరాబాద్: అమెరికా పర్యటన కొనసాగించాలని అధికారుల బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశించారు. అన్ని ఎంవోయూలు యథాతథంగా చేసుకోవాలని అధికారులకు సూచించారు. వర్సిటీలతో భాగస్వామ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవాలని ఆదేశించారు. తన పర్యటనకు రాజకీయ కోణంతో అనుమతి నిరాకరించబడిందని సీఎం ఆరోపించారు. రాజకీయ కోణంలో పర్యటనను అడ్డుకోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నూతన విద్య విధానాన్ని అమలు చేయడం, తెలంగాణకు అత్యుత్తమ విద్యాసంస్థలు తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

కేంద్రం విధానం, ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యూకే, అమెరికా పర్యటనలకు అనుమతి కోరగా, కేవలం యూకే పర్యటనకు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది. అధికారిక ప్రతినిధి బృందం యూకే చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించింది. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను తెలంగాణకు, హైదరాబాద్‌కు తీసుకురావడం, యువతకు ప్రపంచ స్థాయి విద్య, నైపుణ్యాలు, శిక్షణ అందుబాటులోకి తీసుకురావడమే అమెరికా పర్యటన ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.

నా విదేశీ పర్యటన వికసిత్ భారత్ కు దోహదపడుతుందని భావించా

దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయంలో రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని కోరారు. తెలంగాణరైజింగ్‌తో పాటు వికసిత్ భారత్ నిర్మాణానికి కూడా ఈ ప్రయత్నం దోహదపడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా సీఎం రేవంత్ అమెరికా పర్యటనను రద్దు చేసుకుని, ఆగస్టు 23న లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రావాలని నిర్ణయించారు. అయితే అమెరికా పర్యటనను అధికారులు కొనసాగించాలని, హార్వర్డ్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో ప్రతిపాదిత అవగాహన ఒప్పందాలు (MoUs), భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ వంటి సంస్థలు హైదరాబాద్‌ను అత్యుత్తమ మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాయని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి ప్రపంచ స్థాయి టెక్ నాయకులు ఎదిగారని పేర్కొన్నారు. 

తెలంగాణ రైజింగ్ ఆగదు

IIT, ISB, IIIT, NALSAR వంటి ప్రతిష్టాత్మక సంస్థల రాకతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ సంస్థలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCCs) ఆకర్షితమయ్యాయని పేర్కొన్నారు. లండన్‌లో రేవంత్ రెడ్డి షెడ్యూల్ ప్రకారం ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర ప్రముఖ విద్యాసంస్థల విద్యావేత్తలతో కీలక సమావేశాలు కొనసాగనున్నాయి. అలాగే యూకేలోని ప్రముఖ క్రీడా సంస్థలు, స్కిల్లింగ్ రంగ నాయకులతో సమావేశమై తెలంగాణతో భాగస్వామ్యాలను ఏర్పాటు చేసేందుకు చర్చలు జరపనున్నారు.  ప్రతి సాధారణ భారతీయుడికి హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, MIT, LBS, LSE వంటి ప్రపంచ స్థాయి విద్యాసంస్థల విద్య, సర్టిఫికెట్లు హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండేలా చేయాలన్నదే తన సంకల్పమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చాలా మంది నాయకులు తమ పిల్లలను విదేశాలకు పంపాలని కోరుకుంటే, ప్రపంచంలోని అత్యుత్తమ విద్యను భారతదేశానికి తీసుకురావాలన్నదే తన ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రైజింగ్ ఆగదన్న సీఎం రేవంత్  యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, దేశ ప్రగతి రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.