21 August, 2026 | 12:35 PM

ఒకే విగ్రహం.. రెండు నివాళులు..! కాంగ్రెస్‌లో మళ్లీ వేడెక్కిన చర్చ

21-08-2026 12:03 PM

రాజీవ్‌ చౌరస్తాలో వేర్వేరు కార్యక్రమాలు.. కాంగ్రెస్‌లో మళ్లీ వేడెక్కిన చర్చ

వనపర్తి, ఆగస్టు 21 (విజయక్రాంతి):  ఒకే పార్టీ.. ఒకే నాయకుడు.. ఒకే విగ్రహం.. కానీ నివాళులు మాత్రం వేర్వేరు..! మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వేడుకల్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ చౌరస్తాలో చోటు చేసుకున్న పరిణామం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. రాజీవ్‌ గాంధీ విగ్రహానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి(State Planning Board Vice-Chairman Chinna Reddy) ఒక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళులు అర్పించగా.. ఎమ్మెల్యే మేఘారెడ్డి(MLA Megha Reddy) సైతం తన వర్గీయులతో కలిసి వేరుగా నివాళులు అర్పించారు. రాజకీయ విభేదాలు ఉన్నా.. పార్టీ కార్యక్రమం మాత్రం ఒక్కటే కదా? మరి ఒకే వేదికపై కలిసి నివాళులు అర్పించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తోంది. రాజీవ్‌ గాంధీ ఆశయాలకు నివాళులా..? లేక వనపర్తి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వర్గ విభేదాలకు మరో బహిరంగ సంకేతమా..? అంటూ రాజకీయ చర్చ సాగుతోంది.

ఇటీవల చిన్నారెడ్డి–మేఘారెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు బహిరంగ చర్చకు వచ్చిన నేపథ్యంలో ఈ వేర్వేరు కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ శ్రేణులు ఐక్యతను కోరుకుంటున్న వేళ.. ఇద్దరు కీలక నేతలు తమ తమ వర్గాలతో వేర్వేరుగా కనిపించడం చర్చకు మరింత ఆజ్యం పోసింది. “ఒకే పార్టీ.. ఒకే జెండా.. ఒకే నాయకుడి విగ్రహం.. అయినా నివాళులు ఎందుకు వేరు?” అన్న ప్రశ్న ఇప్పుడు వనపర్తి రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇది కేవలం కార్యక్రమాల నిర్వహణలో తేడానా..? లేక వనపర్తి కాంగ్రెస్‌లో అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలకు మరో బహిరంగ ప్రదర్శనా..? అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా.. రాజీవ్‌ చౌరస్తాలో జరిగిన రెండు వేర్వేరు నివాళులు వనపర్తి కాంగ్రెస్‌లో వర్గపోరుకు మరోసారి అద్దం పట్టాయన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోంది.