15 July, 2026 | 6:51 AM

ఇవి నకిలీ యాప్‌లు.. జాగ్రత్త

23-04-2024 01:34 AM

ఎస్బీఐ ఖాతాదారులను మరోసారి హెచ్చరించిన ప్రభుత్వం

మోసపూరిత ఎస్‌ఎంఎస్‌లు క్లిక్ చేస్తే ఖాతా నుంచి నగదు చోరీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: పాన్‌కార్డ్ అప్‌డేట్ చేయాలంటూ వచ్చే నకిలీ ఎస్‌ఎంఎస్‌లపై అప్రమత్తగా ఉండాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులను కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి  హెచ్చరించింది. మొబైల్స్‌కు వచ్చే ఎస్‌ఎంఎస్ లింక్ క్లిక్‌చేసి పాన్‌కార్డ్‌ను అప్‌డేట్ చేయాలని, లేదంటే ఎస్బీఐ యూనో ఖాతా బ్లాక్ అవుతుందంటూ వచ్చే ఎస్‌ఎంఎస్ మెసేజ్‌ల పట్ల గత ఏడాది ప్రభుత్వం ఖాతాదారు లను అలర్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజా గా ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వపు ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్‌మెంట్ హెచ్చరికలు జారీచేసింది. ఎస్బీఐ అధికారిక చానల్ జారీ  చేసినట్టు నమ్మిస్తూ వస్తున్న నకిలీ                 ఎస్‌ఎంఎస్‌లపై అప్రమత్తంగా ఉండాలని, ఇలా ఎస్‌ఎంఎస్‌లు పంపించే యాప్స్.. బ్యాంక్ ఖాతాల నుంచి నగదును తస్కరిస్తాయని ఎక్స్ పోస్టులో ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించే సైబర్‌సేఫ్టీ అండ్ సైబర్‌సెక్యూరిటీ అవేర్‌నెస్ హ్యాండిల్ ‘సైబర్‌దోస్త్’లో ఈ నకిలీ యాప్‌ల పేర్లు ఉంటాయని తెలిపింది. అలాగే యూనియన్‌రివార్డ్స్. ఏపీకే పేరుతో నకిలీ యూనియన్ బ్యాంక్ యాప్ పట్ల యాండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌సెక్యూరిటీ వింగ్ ట్వీట్ చేసింది.

నకిలీ స్టాక్ ట్రేడింగ్ యాప్స్

నకిలీ స్టాక్ ట్రేడింగ్ యాప్స్ ఇటీవల పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అటువంటి యాప్స్ ద్వారా అమాయక ఇన్వెస్టర్లు లక్షలాది రూపాయిలు పోగొట్టుకుంటున్నా రు. ఇటీవల సర్క్యులేట్ అవుతున్న గ్రూప్‌ఎస్ యాప్ నకిలీ స్టాక్ ట్రేడింగ్ యాప్ అని ఐఫోన్ యాజర్లను కేంద్ర ప్రభుత్వపు సైబర్‌సెల్ హెచ్చరించింది. INSECG, CHS-SES, SAAI, SEQUOIA,  GOOMI తదితర యాప్స్ సైతం ప్రమాదకరమైనవని, ఈ యాప్స్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద రిజిష్టర్ కాలేదని పేర్కొంది. అవి యూజర్లను ఆకర్షించి, మోసపూరిత సిఫార్సులతో స్టాక్ ట్రేడింగ్‌లోకి దించుతాయి.షేర్ల కొనుగోలుకు డబ్బును వేరే బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయమంటాయి. నకిలీ లాభాల్ని డిజిటల వ్యాలెట్లపై ప్రదర్శిస్తూ సొమ్మును కాజేస్తాయి.