చాక్లెట్లు ఇక చేదు
క్యాడ్‌బరీ బార్స్, చాక్లెట్
కుకీలు మరింత ప్రియం
11,000 డాలర్లు మించిన కోకో టన్ను ధర
ముంబై, ఏప్రిల్ 22: వినియోగదారులు ఎంతో ఇష్టపడే క్యాడ్‌బరీ బార్స్, చాకోలేట్ కుకీల ధరలు పెరగనున్నాయి. చాక్లేట్ల తయారీలో కీలక ముడి పదార్థమైన కోకో ధరల పెరుగుదలే ఇందుకు కారణం. కోకో పండించే దేశాల్లో దిగుబడి తగ్గడంతో ప్రపంచ మార్కెట్లో కోకో గింజల టన్ను ధర తొలిసారిగా 11,000 డాలర్ల స్థాయిని మించింది. ఈ ఏడాది కేవలం మూడు నెలల్లోనే ఇది 650 డాలర్ల వరకూ పెరిగింది. కోకో ధర పెరుగుదలలో కొంత శాతాన్ని చాక్లెట్ల తయారీ కంపెనీలు వినియోగదారులకు మళ్లిస్తాయని పరిశ్రమ వర్గాలు తెలిపా యి. నెస్లే, మాండెలెజ్, హెర్షేస్ తదితర అంతర్జాతీయ చాక్లెట్ కంపెనీలతో పాటు దేశీయంగా బార్ చాక్లెట్ తయారీదారులు, బిస్కెట్ కంపెనీలు వాటి ఉత్పత్తుల ధరల్ని పెంచుతాయని అంచనా.
ప్రత్యామ్నాయాలపై దృష్టి
కోకో వ్యయాల్ని తట్టుకునేందుకు కొన్ని కంపెనీలు ఇప్పటికే వాటి ఉత్పత్తుల ధరల పెంపునకు సిద్ధంకాగా, మరికొన్ని సంస్థలు వాటి ప్యాక్‌ల్లో గ్రాముల పరిమాణాన్ని తగ్గించాలని నిర్ణయించారు. అంతే కాకుండా చాక్లెట్ ఉత్పత్తుల్లో కోకో బటర్‌కు ప్రత్యామ్నాయంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆమోదించిన చౌక ప్రత్యామ్నాయ పదార్థాలను విని యోగించాలని యోచిస్తున్నాయి. ఈ చర్యలేవైనా తాత్కాలికంగా ఊరటనిచ్చేవే. కోకో ఫైన్ ఫ్లేవర్‌తో చాక్లెట్లు తయా రు చేసే సంస్థలకు ప్రస్తుత పరిస్థితి సవాలుగా మారింది. ఫైన్ ఫ్లేవర్ కోకో, బల్క్ కోకో ధరల మధ్య వ్యత్యాసం తగ్గడంతో ఈ కంపెనీల ప్రైసింగ్ వ్యూహాలకు, లాభదాయకతకు గండి పడుతున్నదని పరిశ్రమ వర్గాలు విశ్లేషించాయి.






