15 July, 2026 | 6:40 AM

రెండో రోజూ ర్యాలీ

23-04-2024 01:36 AM

మరో 560 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

నిఫ్టీ 189 పాయింట్లు జంప్

ప్రపంచ సానుకూల సంకేతాల ప్రభావం

ముంబై, ఏప్రిల్  22 : గతవారం ప్రధమార్థంలో వరుస పతనాలతో ఇన్వెస్టర్లను బెంబేలెత్తించిన భారత స్టాక్ మార్కెట్ ఈ వారం శుభారంభాన్ని ఇచ్చింది. గత శుక్రవా రం కనిష్ఠస్థాయి నుంచి నాటకీయంగా కోలుకుని లాభాలు ఆర్జించిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈ సోమవారం మరో 560 పాయింట్లు పెరిగి 73,649 పాయింట్ల వద్ద నిలిచింది. దీంతో వరుసగా రెండు రోజులు 1,160 పాయింట్లు లాభపడినట్లయ్యింది.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం ఇదేబాటలో మరో 189 పాయింట్లు పెరిగి  22,336 పాయింట్ల వద్ద నిలిచింది. ఈ సూచి వరుస రెండు రోజుల్లో 350 పాయింట్లు లాభపడింది.  ప్రపంచ సానుకూల సంకేతాలు, క్రూడ్ ధరల తగ్గుదల కారణంగా ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు జరిపారని విశ్లేషకులు తెలిపారు. ఆసియాలో సియోల్, టోక్యో, హాంకాంగ్ సూచీలు పెరగ్గా, షాంఘై ఇండెక్స్ తగ్దింది. యూరప్‌లో ప్రధాన మార్కెట్లయిన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్‌లు లాభపడగా, కడపటి సమాచారం అందేసరికి అమెరికా డోజోన్స్, ఎస్ అండ్ పీ ఇండెక్స్‌లు లాభాలతో ట్రేడవుతున్నాయి.

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల తగ్గుదలతో ఊరట

ఇరాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు తగ్గుముఖంపట్టడంతో ప్రపంచ ఈక్విటీలు రిలీప్ ర్యాలీ జరిపాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసా ని తెలిపారు. పరిస్థితి అనిశ్చితంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొంతమేర తగ్గినట్టు కన్పిస్తుందని దీంతో భారత్ మార్కెట్ శుక్రవారంనాటి రిలీఫ్ ర్యాలీని సోమవారం సైతం కొనసాగించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసె ర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. దాదా పు అన్ని రంగాల్లో కొనుగోళ్లు జరిగాయని, మిడ్, స్మాల్ క్యాప్‌ల్లో తిరిగి ఆసక్తి నెలకొందని, క్రూడ్ ధరలు తగ్గడం సైతం దేశీయ మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్‌ను నెలకొల్పిందని వివరించారు. ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 87 డాలర్ల దిగువకు తగ్గింది. 

ఎల్ అండ్ టీ టాప్ గెయినర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా లార్సన్ అండ్ టుబ్రో 2.67 శాతం పెరిగి రూ.3,600పైకి చేరింది. బజాజ్ ఫైనా న్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ,ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్ 1 శాతం మధ్య పెరిగాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 2.53 శాతం పెరగ్గా, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 1.93 శాతం, క్యాపిటల్ గూడ్స్ సూచి 1.65 శాతం,  ఫైనాన్షియల్ సర్వీసుల సూచి 1.04 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 1.02 శాతం చొప్పున పెరిగాయి. యుటిలిటీస్ సూచీ ఒక్కటే నష్టపోయింది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.26 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.93 శాతం చొప్పున పెరిగాయి.