29 July, 2026 | 3:51 PM

నేనూ ప్రభుత్వ బడి బిడ్డనే...

29-07-2026 02:51 PM

మీరు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి"

ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

చర్ల ఏకలవ్య పాఠశాలను సందర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే

చర్ల, జులై 29 : (విజయక్రాంతి): "కష్టపడి చదవండి. క్రమశిక్షణతో ముందుకు సాగితే లక్ష్యం తప్పకుండా చేరుకుంటారు" అని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు విద్యార్థులకు స్ఫూర్తి నింపారు. బుధవారం  ఆయన చర్ల మండలంలోని ఏకలవ్య పాఠశాల ను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే తన జీవిత అనుభవాలను పంచుకున్నారు.

"నేనూ మీలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివాను. కష్టపడి డాక్టర్‌గా ఎదిగాను. ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచాను. మీరు కూడా కష్టపడితే ఏ ఉన్నత శిఖరాన్నైనా అధిరోహించవచ్చు" అని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.  అనంతరం పాఠశాల భోజనశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే, విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులతో సమావేశమై పాఠశాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చర్ల సిఐ రాజ్ వర్మ, ఎస్సై నరసింహరెడ్డి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.