భారత్ బంద్ పాక్షికం
- పలు రాష్ట్రాల్లో దళిత, ఆదివాసీల ఆందోళన
- బీహార్‌లో రోడ్లు బంద్.. పోలీసుల లాఠీచార్జ్
- పంజాబ్, రాజస్థాన్, యూపీ, బీహార్‌లో ప్రభావం
- బంద్ వెనుక విపక్షాలు.. బీజేపీ విమర్శలు
న్యూఢిల్లీ, ఆగస్టు 21: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దుచేయాలని కుట్రలు చేస్తున్నదని ఆరోపిస్తూ ఆదివాసీ, దళిత సంఘాలు బుధవారం నిర్వహించిన భారత్ బంద్ కొన్ని రాష్ట్రాలు మినహా పెద్దగా ప్రభావం చూపలేదు. లేటరల్ ఎంట్రీ వంటి విధానాలతో రిజర్వేషన్లకు కేంద్రం ప్రమాదం తలపెడుతున్నదని.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతివ్వటం కూడా రిజర్వేషన్ల అంతానికి దారి తీస్తుందని బంద్‌కు పిలుపునిచ్చిన నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్స్ (నాక్‌డోర్) ఆరోపిస్తున్నది.
పాట్నాలో ఉద్రిక్తత
భారత్ బంద్‌లో భాగంగా నిరసనకారులు బీహార్ రాజధాని పాట్నాలో భారీ ర్యాలీలు నిర్వహించారు. రోడ్లపై భైటాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంలో ఓ కానిస్టేబుల్ పొరపాటున జిల్లా పోలీస్ అధికారినే కొట్టడం సంచలనంగా మారింది. సివిల్ డ్రెస్‌లోని ఉన్న పాట్నా ఎస్‌డీఎం శ్రీకాంత్ కండ్లిక్ ఖండేకర్‌పై ఓ కానిస్టేబుల్ లాఠీచార్జీ చేశాడు. ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.
విపక్షాల మద్దతు
భారత్ బంద్‌కు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ప్రకటించాయి. కాన్పూర్‌లో బీఎస్పీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. బంద్‌కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు ప్రకటించారు. కాన్పూర్‌లో ఎస్పీ కార్యకర్తలు బలవంతంగా షాపులను మూసివేయించి బంద్‌కు మద్దతు పలికారు. ఆగ్రా నగరంలో బీఎస్పీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి.
ఇది కారణం లేని బంద్: బీజేపీ
భారత్ బంద్‌పై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ స్పందించాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రభుత్వం ఇప్పటికే తన నిర్ణయం ప్రకటించిందని బీజేపీ నేత ఫగ్గన్‌సింగ్ కులస్తే తెలిపారు. రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ‘తీర్పులో న్యాయమూర్తులు తమ అభిప్రాయం తెలిపారు. ఈ అంశంపై నాతోపాటు 60-70 మంది ఎంపీలు ప్రధానిని వ్యక్తిగతంగా కలిసి ఈ అంశాన్ని ప్రస్తావించారు. రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అమలుచేయబోమని ఆయన స్పష్టంగా చెప్పారు’ అని కులస్తే వివరించారు. భారత్ బంద్ ఎందుకు నిర్వహిస్తున్నారో.. అది నిర్వహిస్తున్నవారికే తెలియదని కేంద్ర మంత్రి బన్వారీలాల్ వర్మ విమర్శించారు.






