22 April, 2026 | 9:08 PM

పోలండ్‌తో మనది గట్టి బంధమే

22-08-2024 12:22 AM
  1. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పోలండ్ వాసులకు ఆశ్రయం కల్పించిన దిగ్విజయ్ సింగ్
  2. పాత రోజులను నెమరువేసుకుంటున్న పోలండ్ జాతీయులు

న్యూఢిల్లీ, ఆగస్టు 21: భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలండ్‌లో అడుగుపెట్టారు. గత నాలుగు దశాబ్దాలుగా భారత ప్రధానులెవరూ పోలండ్ గడ్డ మీద పర్యటించలేదు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత పోలండ్ పర్యటన చేస్తున్న ప్రధానిగా మోదీ రికార్డులకెక్కారు. ప్రధాని పర్యటన సమయంలో అప్పుడెప్పుడో జరిగిన రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆసక్తికర సంఘటనను అంతా గుర్తు చేసుకుంటున్నారు. జమ్నానగర్ మహారాజ దిగ్విజయ్ సింగ్ రంజిత్ సింగ్ జడేజా ఔదార్యాన్ని అంతా గుర్తు చేసుకుంటున్నారు. యుద్ధంతో రక్తసిక్తమైన పోలండ్ నుంచి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని వచ్చిన ఎంతో మంది శరణార్థులకు ఆయన ఆశ్రయం కల్పించారు. భారత ప్రధాని తాజా పర్యటన నేపథ్యంలో మరో మారు ఇందుకు సంబంధించిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఆ మహారాజును పోలండ్ వాసులు కీర్తిస్తున్నారు.  

1,000 మంది పిల్లలను కాపాడిన వీరుడు

ఒక్కర్ని కాపాడితేనే వీరుడని కీర్తిస్తారు. అటువంటిది నవాన్‌గర్‌ను పాలిస్తున్న మహారాజ జామ్ సాహెబ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పోలండ్‌కు చెందిన దాదాపు 1,000 పిల్లలను రక్షించాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పోలండ్ దేశం యూఎస్‌ఎస్‌ఆర్, జర్మనీ ఆక్రమణకు బలైంది. దీంతో అనేక మంది పిల్లలు, అనాథలు, దివ్యాంగులుదేశం నుంచి వెలివేయబడ్డారు. యూకే ప్రధాని చర్చిల్ పోలండ్ నుంచి వచ్చిన శరణార్థులకు ఆశ్రయం కల్పించాడు. తర్వాత బ్రిటీష్ వలస పాలనలో ఉన్న భారత్ మీద చర్చిల్ కన్ను పడింది.

వెంటనే ఢిల్లీలో పోలిష్ పిల్లలకు శరణార్థి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్యాంపు నవాన్‌గర్ మహారాజ జమ్ సాబ్ దిగ్విజయ్ ఆధ్వర్యంలో నడపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సంక్షోభం మీద స్పందించిన మహారాజు తన రాజ్యంలో పోలిష్ పిల్లలకు ఆశ్రయం కల్పించాడు. ఆ సంక్షోభ సమయంలో మహారాజు అందించిన సేవలకు గుర్తుగా వార్సాలో గుడ్ మహారాజా పేరుతో మెమోరియల్‌ను ఏర్పాటు చేశారు. మహారాజా జమ్ సాబ్‌ను ‘మంచి మహారాజా’ అని పోలండ్‌లో కీర్తిస్తారు. అతడిని గుర్తుంచుకునేలా పోలండ్ గవర్నమెంట్ వార్సాలో స్కేర్ ఆఫ్ ది గుడ్ మహారాజా అని ఏర్పాటు చేసింది. ఒక పాఠశాలకు కూడా అతడి పేరు పెట్టింది. 

కొల్హాపూర్‌లో 5,000 మందికి ఆశ్రయం

చత్రపతి భోన్సాలే ఆధ్వర్యంలో కొల్హాపూర్‌లో శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో దాదాపు 5వేల మంది ఆశ్రయం పొందారు. ఎటువంటి కష్టాలు లేకుండా జీవనం సాగించారు. మహారాష్ట్ర గడ్డ మీద ఇప్పటికి కూడా పోలిష్ శరణార్థుల గుర్తులు ఉన్నాయి. కొల్హాపూర్‌లో 78 మంది పోలిష్ శరణార్థుల స్మశాన వాటిక ఉండడం గమనార్హం.  

వార్సాలో భారత ప్రధానికి ఘన స్వాగతం

పోలండ్ ప్రధానితో చర్చలు జరుపనున్న మోదీ

ప్రధాని మోదీ మూడు రోజుల యూరప్ పర్యటనలో భాగంగా బుధవారం పోలండ్ చేరుకొన్నారు. ఆ దేశ రాజధాని వార్సాలో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంతోపాటు మోదీ బస చేసిన హోటల్ వద్దకు ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున చేరుకొని మోదీకి స్వాగతం పలికారు. కొందరు మహిళలు మోదీకి రాఖీలు కట్టారు. తాను బస చేసిన హోటల్లో మోదీ ప్రవాస భారతీయుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. భారత ప్రధాని పోలండ్‌లో పర్యటించటం 45 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. పోలండ్- భారత్ మధ్యదౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా మోదీ చేపట్టిన పర్యటన ప్రాధాన్యం సంతరించుకొన్నది.