22 April, 2026 | 6:04 PM

ఇండియన్ అమెరికన్లు ఎటువైపు?

22-08-2024 12:18 AM

ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతు లభించేనా?

డొనాల్డ్ ట్రంప్‌కే ఎక్కువ మంది మద్దతు

వాషింగ్టన్, ఆగస్టు 21: ఇండియన్ అమెరికన్లు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ను హర్షిస్తున్నారు.. కానీ ఆమెకు ఓటు వేసి మద్దతుగా నిలిచే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. తాజాగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓ సభలో మాట్లాడుతూ.. ‘కమలా హారిస్ కంటే నాకే ఎక్కువ మంది ఇండియన్ల మద్దతు ఉంది’ అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను సూక్ష్మంగా పరికిస్తే అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో ఎక్కువ మంది తనకే మద్దతు ఇస్తున్నారనే ధీమా ప్రస్ఫుటమవుతోంది.

అధ్యక్ష ఎన్నికల బరి నుంచి జో బైడన్ వైదొలిగిన తర్వాత కమలా హారిస్ బరిలో దిగుతున్నట్లు ప్రకటన విడుదలైన తర్వాత కొందరు ఇండియన్ అమెరికన్లు స్వాగతించినప్పటికీ, ఆమెకు ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తారా? అనే సందిగ్ధత నెలకొన్నది. అందుకు ప్రధాన కారణం జో బైడన్ కమలా ద్వయం అమెరికాలోని పాకిస్థాన్ మద్దతుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తుండడం. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ కమలా హారిస్ గెలిస్తే ఆమె పాకిస్థాన్‌కు అనుకూలంగా పనిచేస్తారని ఇండియన్ అమెరికన్లు భావిస్తున్నట్లు తెలిసింది.  

కమలా మెరుగైన ప్రసంగాలతో..

కమలా హారిస్‌కు మద్దతు కూడగట్టేందుకు డెమోక్రాటిక్ పార్టీ దేశవ్యాప్తంగా వలంటీర్లను రంగంలోకి దించుతోంది. వలంటీర్లు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి యువతను ఆకర్షించే పనిలో పడ్డారు. బైడన్ కంటే కమలా హారిస్ ప్రసంగాలు మెరుగ్గా ఉండటాన్ని హైలైట్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వాక్చాతుర్య ధాటికి నిలబడి ఆమె ప్రసంగాలు మరింత పదునుగా ఉంటుండడంతో కొంత ఆమెకు కలిసివస్తున్నది.

2020 నుంచి బైడన్‌కు తగ్గిన మద్దతు..

2020 నుంచి జో బైడన్‌కు ఆసియా  అమెరికన్ల మద్దతు తగ్గుముఖం పట్టిందని ఓ సర్వేలో తేలింది. డ్రూ వర్సిటీ పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ సంజయ్ మిశ్రా  స్పందిస్తూ.. ‘2020కి ముందు జోబైడన్‌కు వచ్చిన మద్దతు కంటే.. ప్రస్తుతం కమలా హారిస్‌కు ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు చాలా ఎక్కువ. కానీ వీరిలో ఇండియన్ అమెరికన్లు పెద్దగా ఉండకపోవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. ‘నేను ట్రంప్‌కు వందశాతం మద్దతు ఇస్తున్నాను. కమలా హారిస్‌కు ఓటు వేయను.

ఆమె తనను తాను నల్లజాతి మహిళగా చెప్పుకొంటారు. ఆమె భారతీయురాలిగా ఒక్కసారిగా ప్రకటించలేదు’ అని ఇటీవల ఫ్లోరిడాకు చెందని హోటల్ వ్యాపారి డానీ గైక్వాడ్ చెప్పారు.   కాలిఫోర్నియాకు చెందిన ఉద్యోగి పుష్పిత ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఇమ్మిగ్రేషన్, వీసా సమస్యలతో ఇండియన్ అమెరికన్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అమెరికాలోని ఎన్నో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. వీటితో పాటు బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపైనా కమలా హారిస్ స్పందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం’ అని చెప్పారు.