మంథనిలో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్
- మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పుట్ట శైలజపై అనర్హత వేటు
- గత ఎన్నికల అఫిడవిట్‌లో తప్పులపై కోర్టు తీర్పు
మంథని, జూన్ 14 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్, కౌన్సిలర్ పుట్ట శైలజపై శుక్రవారం అనర్హత వేటు పడింది. 2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆమె సమర్పించిన అఫిడవిట్‌లో తప్పులున్నాయని నిర్దారిస్తూ శుక్రవారం రంగారెడ్డి జిల్లా ట్రిబ్యునల్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఆమె ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు రావడం మంథనిలో సంచలనంగా మారింది. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఆమె వార్డు కౌన్సిలర్‌గా గెలిచి అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కొనసాగింది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమెపై అవిశ్వాసం నెగ్గింది.
గతంలో తన ప్రత్యర్థి ఆయేషా ఫాతిమా కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. కరీంనగర్ ట్రిబ్యునల్ కోర్టు నుంచి రంగారెడ్డి జిల్లాకు కేసును బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు విచారణ అనంతరం తాజాగా శుక్రవా రం సంచలన తీర్పు వెల్లడైంది. అఫిడవిట్‌లో ఆమె సమర్పించిన ఆస్తుల వివరాలు తప్పుగా ఉన్నాయంటూ న్యాయస్థానం భావించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం ఆమె కొనసాగుతున్న వార్డు కౌన్సిలర్ స్థానానికి మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొన్నది.






