22 June, 2026 | 2:21 PM

Breaking News

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •  

రుణాలు చెల్లించకుంటే భూముల జప్తు

15-06-2024 12:56 AM
  • ఫ్లెక్సీలు, జెండాలు పాతిన ఎన్‌డీసీసీబీ అధికారులు
  • వడ్డీ మాఫీ చేస్తే వాయిదా పద్ధతిలో చెల్లిస్తామన్న రైతులు
  • రూ.2 లక్షల అప్పుకు రూ.14 లక్షలు కట్టాలంటున్న బ్యాంకర్లు
  • లింగంపేట బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా, రాస్తారోకో
  • రైతులకు మద్దతుగా నిలిచిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల 

కామారెడ్డి, జూన్ 14 (విజయక్రాంతి): పంట రుణాలు తీసుకున్న పాపానికి బ్యాంకర్లు తనఖా పెట్టిన భూములను జప్తు చేసి, వేలం వేస్తామని జెండాలు, ప్లెక్సీలు పాతడం కామారెడ్డి జిల్లాలో శుక్రవారం కలకలం రేపింది. ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామనే రాజకీయ పార్టీల హామీలపై ఆశతో ఉన్న రైతులపై బ్యాంకు అధికారులు చర్యలకు దిగడం ఆందోళనకు గురిచేసింది. ప్రభుత్వాలు మారుతున్నా, తమ రుణాలను మాత్రం ఏ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో మాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు వడ్డీలపై వడ్డీలు పెరిగి, రైతులు కట్టలేని స్థితిలోకి వెళ్లారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో ప్రభుత్వమే మాఫీ చేస్తుందనే ఉద్దేశంతో రైతులు రుణాలు చెల్లించలేదు.

బ్యాంకర్లు మాత్రం పంట రుణాలను రైతులు సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీల మీద వడ్డీలు వేయడంతోరూ.౩లక్షల పంట రుణం తీసుకున్న రైతులకు రూ.12 లక్షలు, రూ.14లక్షలు, రూ.16 లక్షల చొప్పున చెల్లించాలంటూ నోటీసులను జారీ చేశారు. కాంగ్రెస్ సైతం తాము అధికారంలోకి వస్తే రూ.౨లక్షల రైతు పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. బ్యాంకర్లు మాత్రం రుణాలు చెల్లించాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. రైతుల ఇండ్లకు వెళ్లి, వేధింపులకు గురి చేయడమే కాకుండా, శుక్రవారం రైతుల పంట పొలాల వద్దకు వెళ్లి, ఎర్ర జెండాలు, ఫ్లెక్సీలు పాతడం వివాదానికి దారితీసింది.

తాము తీసుకున్న రుణాలు లక్ష, రెండు లక్షలు ఉంటే, పది, పన్నెండు లక్షలు చెల్లించాలని బ్యాంకర్లు పేర్కొనడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే బ్యాంకర్లపై చర్యలు తీసుకొని, తాము తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని కోరుతున్నారు. లింగంపేట ఎన్‌డీసీసీ బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. బ్యాంకు అధికారుల తీరును నిరసిస్తూ ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. రైతులకు మద్దతుగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నిలిచారు. బ్యాంకు అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వమే బ్యాంకర్లను రైతులపై ఉసిగొల్పుతుందని అన్నారు. 

బ్యాంక్ అధికారుల తీరుపై మంత్రి తుమ్మల సీరియస్

రైతుల భూముల్లో జెండాలు పాతిన బ్యాంక్ అధికారుల తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల అతిగా వ్యవహరించిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒకవైపు ప్రభుత్వం రైతులకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణ మాఫీని చేస్తామని ప్రకటించినా.. అధికారులు రైతుల జెండాలు పాతడం సరైన చర్య కాదని అసహనం వ్యక్తం చేశారు. రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని చెప్పారు.  

ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి

ఎన్‌డీసీసీ బ్యాంకులో 2010లో రూ.2 లక్షలు రుణం తీసుకున్నా. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పిం ది. దీంతో రుణం చెల్లించలేదు. ప్రభు త్వం పూర్తిస్థాయిలో రుణాలను మాఫీ చేయలేదు. దీంతో వడ్డీలు పెరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.౨ లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఇంత వరకు మాఫీ చేయలేదు. రుణాలు చెల్లించకుంటే భూములు జప్తు చేస్తామని బ్యాంకు అధికారులు మా భూముల్లో ఎర్ర జెండాలు, ప్లెక్సీలు పాతారు. 

 నర్సింహారెడ్డి, రైతు, 

పొల్కంపేట, కామారెడ్డి జిల్లా.

బ్యాంకు అధికారులు వేధిస్తున్నారు

ఎన్‌డీసీసీ బ్యాంకు నుంచి తీసుకున్న పంట రుణాలను వడ్డీ లేకుండా చెల్లించేందుకు సిద్దంగా ఉన్నాం. ప్రభుత్వం మాఫీ చేస్తామని హామీ ఇవ్వడం వల్లనే రుణాలను సకాలంలో చెల్లించలేక పోయాం. బ్యాంకర్లు మాత్రం పంట రుణాలపై అధిక వడ్డీలు విధించి రైతులు చెల్లించలేని విధంగా రూ.14 లక్షలకు చేర్చారు. పంట రుణాలను చెల్లిస్తామని చెప్తున్నా, బ్యాంకర్లు మా పొలాల్లో జెండాలు, ఫ్లెక్సీలు పాతి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

 రాజశేఖర్ రెడ్డి, రైతు, పొల్కంపేట