జాగిలాల దిగుమతి నిషేధంపై హైకోర్టు స్టే
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): క్రూరమైన, ప్రమాదకరమైన 25 రకాల విదేశీ జాతి కుక్కల దిగుమతులు, పెంపకంపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వ జారీచేసిన ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రమాదకరమైన, క్రూరమైన కుక్కలుగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం 25 రకాల విదేశీ జాతి జాగిలాల దిగుమతులు, బ్రీడింగ్, పెంపకం, విక్రయాలపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర పశుసంవర్ధకశాఖ మార్చి 12న సర్క్యులర్ జారీ చేసింది. దీనిని ఫరీదున్నీసా హుమా, ఈస్తర్ చౌదరితోపాటు మరో రెండు స్వచ్ఛంద సంస్థలు హైకోర్టులో సవాలు చేశాయి.
పిటిషన్లను శుక్రవారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. పిటిషనర్ తరపున న్యాయవాది పీ శ్రీరమ్య వాదించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కుక్కల పెంపకం దారుల హక్కులకు భంగం కలిగించేలా ఉందని తెలిపారు. జంతు ప్రేమికులుగా కుక్కలను పెంచుకునేవారి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. శాస్త్రీయ ఆధారాలు లేకుండా కేంద్రం నిషేధించిందని ఆరోపించారు. ఇప్పటికే కర్ణాటక మద్రాస్, ఢిల్లీ హైకోర్టులు కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్ అమలును నిలిపిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశాయని గుర్తు చేశారు.
వాదనల సందర్భంగా కల్పించుకున్న ధర్మాసనం.. కుక్కలు కాటు వేయడం వల్ల చాలా మంది అమాయకులు మరణిస్తున్నారని, మన కుక్కలు చాలవా, విదేశీ కుక్కలు అవసరమా? అని ప్రశ్నించింది. కుక్కల పెంపకాన్ని ఓ హోదా పరిగణిస్తున్నారని, వాటి పెంపకానికి ఖర్చు కూడా ఎక్కువే అవుతుందని అభిప్రాయపడింది. కేంద్రం జారీచేసిన సర్క్యులర్ అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను జూలై 5వ తేదీకి వాయిదా వేసింది.






