మహేశ్వరంలో రెండు పార్టీలకు బిగ్‌షాక్

01-05-2024 02:04:12 AM

బీజేపీలో చేరిన మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేటర్లు

కాంగ్రెస్ నుంచి ముగ్గురు కార్పొరేటర్లు,

బీఆర్‌ఎస్ నుంచి నలుగురు కార్పొరేటర్లు

మహేశ్వరం, ఏప్రిల్ 30(విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ రాజకీయం వేడేక్కుతుంది. మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు బలంగా షాక్ తగిలింది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు కార్పొరేటర్లు, ఓ కోఅప్షన్ మెంబర్, బీఆర్‌ఎస్ నుంచి నలుగురు కార్పొరేటర్లు మంగళవారం జూబ్లీహిల్స్‌ని తన నివాసంలో కొండావిశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాషాయం కండువాను కప్పుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోడ్ షో రోజునే అధికార పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు, ఓ కో మెంబర్ బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. దీనికితోడు ప్రతిపక్ష పార్టీ నాయకురాలిగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలో తన ఉనికిని నిలబెట్టుకుంటూ ఓ వైపు పార్టీ బలం పెంచుకుంటూనే మరోవైపు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం కృషి చేస్తూ ప్రతిరోజు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. అయినప్పటికీ మీర్‌పేట్ కార్పొరేషన్ నుంచి నలుగురు కార్పొరేటర్లు బీజేపీలో చేరడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తుంది. 

బీజేపీలో చేరిన కార్పొరేటర్లు

కాంగ్రెస్ నుంచి వేముల నర్సింహ 32వ డివిజన్ కార్పొరేటర్, ఎడ్ల మల్లేశ్‌ముదిరాజ్ 36వ డివిజన్, అరుణ ప్రభాకర్‌రెడ్డి 28వ డివిజన్, వేముల ఎల్లమ్మ కోఅప్షన్ మెంబర్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. బీఆర్‌ఎస్ నుంచి విజయలక్ష్మిరాజు 31వ డివిజన్, గౌరీ శంకర్ 2వ డివిజన్, ఇందిరావత్ రవి నాయక్ 12వ డివిజన్, జ్యోతి కిషోర్ 44వ డివిజన్ నుంచి బీజేపీలో చేరారు.

భవిష్యత్తు బీజేపీదే: కొండా

చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ పార్టీ బలం పెరుగుతుందన్నారు. ముఖ్యంగా రాబో యే ఎన్నికల్లో అత్యధిక పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకోబోతుందని, చేవెళ్ల పార్లమెంట్‌లో బీజేపీకి ఆదరణ వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రె స్, బీఆర్‌ఎస్ నుంచి నాయకులు బీజేపీలో చేరేందుకు ఇష్టపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.