శెభాష్.. కలెక్టరమ్మ!

01-05-2024 02:06:00 AM

టెన్త్‌క్లాస్ తప్పిఇంట్లో ఉంటున్న124 మంది గుర్తింపు

వారికి ప్రత్యేక తరగతులు చెప్పించిన కలెక్టర్ సత్పతి

శ్రద్ధగా చదువుకుని ఏకంగా 72 మంది పరీక్షలు పాస్

కరీంనగర్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ఆమె ఓ సివిల్ సర్వెంట్. జిల్లా కలెక్టర్. పాలనాపరంగా ఆమె నిత్యం సమీక్షలు, సమావేశాలతో బిజీ బిజీగా ఉంటారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తూ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ ఉంటారు. అయినప్పటికీ ప్రతిరోజూ కొంత సమయాన్ని వెచ్చించి విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించారు. ఆమే పమేలా సత్పతి. కరీంనగర్‌క కలెక్టర్‌గా ఆమె బాధ్యతలు తీసుకుని అర్నెళ్లు పూర్తవుతున్నది. రోజూవారీ కార్యక్రమాలతోపాటు ఆమె ఐదేళ్ల నుంచి పదోతరగతి పరీక్షలు తప్పుతూ, అనేక కారణాలతో పరీక్షలు రాయకుండా, ఉత్తీర్ణత సాధించకుండా ఇంటి వద్దే ఉంటున్న 124 విద్యార్థులను గుర్తించారు.

అతి కష్టం మీద విద్యాశాఖ అధికారులు విద్యార్థుల చిరునామాలను సాధించారు. ఎలాగోలా పదో తరగతి ఉత్తీర్ణత సాధిస్తే బాలలు భవిష్యత్తులో ఏదైనా ఉపాధి చూసుకుంటారని కలెక్టర్ సంకల్పించారు. ఈ మేరకు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి తమ పిల్లలతో పరీక్ష రాయించేందుకు ఒప్పించారు. వీరిలో నలుగురు బాలికల పరీక్ష ఫీజును కలెక్టర్‌నే స్వయం గా చెల్లించారు. ప్రత్యేకంగా ఉపాధ్యాయులను కేటాయించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. 124 మంది విద్యార్థుల్లో 95 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తాజాగా మంగళవారం విడుదలైన పరీక్షా ఫలితాల్లో 72 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు దీంతో కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ చొరవకు ఇప్పుడు జిల్లావాసులంతా శెభాష్.. అంటున్నారు. 

చాలా ఆనందంగా అంది:- కలెక్టర్

పదోతరగతి ఫెయిల్ అయి 124 మంది విద్యార్థులు ఇంటికే పరిమతమై ఉంటున్నారని తెలుసుకుని, వారిపై దృష్టి సారించామని, ఏకంగా 72 మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఆనందాన్నిచ్చిందన్నారు. విద్యార్థులు ఇతర ఫెయిల్ అయిన విద్యార్థులకూ ఆదర్శప్రాయులని కొనియాడారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను ఈ సందర్భంగా డీఈవో జనార్దన్‌రావు మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని కలెక్టర్ అభినందించారు. విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రుల చొరవతోనే విద్యార్థులు పరీక్షల్లో పాస్ అయ్యారని కలెక్టర్ అన్నారు.