16 July, 2026 | 11:36 AM

బీమా సుగమ్ ఆగయా

21-04-2024 12:20 AM

అన్ని కంపెనీల పాలసీలకు

ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం

మరింత చౌకగా ఇన్సూరెన్స్ పత్రాలు

పాలసీల కొనుగోలు, క్లెయిం

సెటిల్‌మెంట్ మరింత సులభం

ఇన్సూరెన్స్ పాలసీలు ఇక నుంచి డిస్కౌంట్ ధరలో పొందవచ్చు. పాలసీల కొనుగోలు, క్లెయిం సెటిల్‌మెంట్‌వంటివన్నీ, పాలసీదారులే స్వయంగా, సులభంగా చేసుకోవచ్చు.  ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ తాజాగా ఆన్‌లైన్  ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫాం ‘బీమా సుగమ్’ ఏర్పాటుచేసే  ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది. బీమా సుగమ్  పేరుతో ఇన్సూరెన్స్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్  నెలకొల్పుతున్నట్టు మార్చి 22న ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అధారిటీ  ప్రకటించింది. కొత్త బీమా పాలసీల  కొనుగోలు, రెన్యువల్స్, క్లెయిం  సెటిల్‌మెంట్, ఇన్సూరెన్స్  పోర్టబిలిటీ, వివాదాల పరిష్కార ప్రక్రియ వంటి సదుపాయా లన్నింటినీ పాలసీహోల్డర్లకు డిజిటల్ రూపంలో 

కల్పించేదే ఈ  బీమా సుగమ్. 

ఈ ప్లాట్‌ఫాం

ఇన్సూరెన్స్ కంపెనీలు వాటి పత్రాలకు విక్రయించే ఈ ప్లాట్‌ఫాం ఈ బీమా సుగమ్. జీవిత, సాధారణ బీమా పాలసీలను అందించే అన్ని కంపెనీలకు ఇది ఒకే గొడుగు కిందకు తెస్తుంది. ఈ ప్లాట్‌ఫాం ద్వారా పాలసీలు తీసుకోవడం, వాటిని పునరుద్ధరించుకోవడం, క్లెయింలను సెటిల్ చేసుకోవడం, పాలసీని మరో కంపెనీకి మార్చుకోవడం తదితర సేవలన్నింటినీ పొందవచ్చు. అలాగే వివాదాల పరిష్కార ప్రక్రియ కూడా పూర్తిచేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ పరిశ్రమలో పాలుపంచుకునే ఖాతాదారులు, బీమా కంపెనీలు, అనుసంధాన సంస్థలు, ఏజెంట్లు తదితర భాగస్వామ్య పక్షాలన్నింటికీ ఒన్‌స్టాప్ సొల్యూషన్‌గా ఈ ప్లాట్‌ఫాంను ఐఆర్‌డీఏఐ అభివర్ణించింది. భాగస్వామ్యపక్షాలన్నింటినీ కలపడం ద్వారా ఇన్సూరెన్స్ పాలసీల్లో పారదర్శకత, సమర్థత రూపుదిద్దుకుంటుందని తెలిపింది. వివిధ ప్రభుత్వ డాటాబేస్‌లు, ఇన్సూరర్లు, ఇంటర్మీడియరీస్, ఇన్సూరెన్స్ రిపాజిటరీలను అనుసంధానం చేస్తుందని పేర్కొంది.

పాలసీదారులకు ప్రయోజనం ఏమిటి?

ఇన్సూరెన్స్ కంపెనీలకే కాదు.. పాలసీదారులకు ఉపయోగపడే అంశాలు బీమా సుగమ్‌లో ఉన్నాయి. మీ బీమా ప్రయాణం సాఫీగా, సరళంగా, చౌకగా కొనసాగడానికి ఉపకరిస్తుంది. ఎటువంటి పేపర్‌వర్క్ అక్కర్లేదు. పెద్ద పెద్ద ఫారాలు నింపాల్సిన పనిలేకుండా, మీరు నేరుగా లేదా మీ ఏజెంట్లు, బ్రోకర్ల ద్వారా బీమా పాలసీలను ఈ రూపంలో  తీసుకోవచ్చు. రెన్యువల్స్ కోసం, క్లెయింల కోసం బీమా డాక్యుమెంట్లను భౌతికరూపంలో అట్టిపెట్టుకోవాల్సిన పనిలేదు.

డిజిటల్ రూపంలోనే పాలసీ

బీమా సుగమ్‌తో మీ పాలసీ డిజిటల్ రూపంలోనే స్టోర్ అయి ఉంటుంది. మీ ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ ద్వారా సాఫ్ట్ కాపీలు కూడా లభ్యమవుతాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు కొత్త, పాత కస్టమర్లు ఇరువురికీ ఈ ఆప్షన్ ఇస్తారు. బీమా సుగమ్‌తో సింగిల్ విండో ద్వారా పాలసీలను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ విండో ద్వారా మీ పాలసీ వివరాలు, రెన్యువల్ తేదీలు చూసుకోవచ్చు. సర్వీసు విజ్ఞప్తులు చేయవచ్చు.

క్లెయిం సెటిల్‌మెంట్

బీమా సుగమ్‌తో పాలసీలన్నీ లింక్ అయిఉంటాయి. ఒకే ప్లేస్‌లో స్టోర్ అయి ఉంటాయి. అందుచేత పాలసీ లబ్దిదారులు, నామినీలు క్లెయిం సెటిల్‌మెంట్ ప్రక్రియను ఏ బాదరబందీ లేకుండా సులభంగా చేసుకోవచ్చు. అంతేకుండా పాలసీలు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది.  ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఇన్సూరెన్స్ వెబ్ ఆగ్రిగేటర్లు పాలసీల విక్రయంపై కొంత కమీషన్ తీసుకుంటారు. బీమా సుగమ్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలే నేరుగా పాలసీలను విక్రయించనున్నందున, ఇంటర్మీడియరీలకు చెల్లించే కమీషన్ మిగులుతుంది. దాంతో పాలసీహోల్డర్లు చెల్లించాల్సిన ప్రీమియం తగ్గుతుంది.

అదనపు చార్జీలు లేవు

‘ప్రతీ ఒక్కరికీ సులభంగా, చౌకగా బీమా సదుపాయం అందించాలనే ఉద్దేశ్యంతోనే బీమా సుగమ్ తెస్తున్నారు. పాలసీ జారీ నుంచి క్లెయిం సెటిల్‌మెంట్ వరకూ ప్రతీదీ పారదర్శకంగా జరుగుతుంది. పైగా బీమా సుగమ్ కోసం మీరు అదనంగా చార్జీలేమీ చెల్లించనక్కర్లేదు’

 తరుణ్ చుగ్, ఎండీ సీఈవో, 

బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్

యూపీఐ తరహాలోనే 

బీమా సుగమ్


‘బ్యాంకింగ్ రంగానికి యూపీఐ లాంటిదే ఈ బీమా సుగమ్. ఇన్సూరెన్స్ రంగం రూపురేఖల్ని మార్చేస్తుంది. ఇన్సూ రెన్స్‌ను సులభంగా తీసుకోవచ్చు. కొత్త బీమా సాధనాలు రూపుదిద్దుకుంటాయి’


- కిషోర్ కుమార్, ఎండీ సీఈవో, 

ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్