ఆభరణాల ధరల్లో తేడాలెందుకు?
అంతర్జాతీయ మార్కెట్లో కదలికలకు అనుగుణంగా మన దేశంలో బంగారం ధరలు రోజురోజుకూ మారుతుంటాయి. ఈ మధ్యకాలంలో మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో పుత్తడి ధర పరుగులు తీస్తున్నది. ఇందుకు తగ్గట్లే ఆభరణాల ధరలు సైతం శరవేగంగా ఎగిసిపోతున్నాయి. బంగారం ధరలు లేదా ఆభరణాల ధరల్లో దేశంలోని ప్రతీ నగరంలో వ్యత్యాసాలుంటాయి. అలాగే జ్యువెల్లర్స్ షాపుల మధ్యా ధరల తేడా ఉంటుంది. పన్నులు, రవాణా వ్యయాలు, పసిడి స్వచ్ఛత ప్రమాణాలు, స్థానిక డిమాండ్, సరఫరాలే ఈ వ్యత్యాసాలకు కారణం. ఈ నేపథ్యంలో పుత్తడి ఆభరణాల ధరల్ని ప్రభావితం చేసే అంశాలేమిటో తెలుసుకుందాం..
బంగారంపై పన్నులు
కేంద్ర ప్రభుత్వం విధించే దిగుమతి సుంకంతో పాటు గతంలో వివిధ రాష్ట్రాలు ఒక్కోరీతిలో వాల్యూయాడెడ్ టాక్స్ (వ్యాట్) విధించేవి. ఇప్పుడు వ్యాట్ స్థానంలో జీఎస్టీ వచ్చినందున, అన్ని రాష్ట్రాల్లో స్థానిక పన్నులు ఒకటే. అయితే రవాణా, ప్రాంతీయ డిమాండ్, సరఫరా, హాల్‌మార్కింగ్, తదితరాలు ప్రతీ నగరంలోనూ ధరల తేడాకు కారణం.
ఆభరణాల తయారీకి వాడే పసిడి
బంగారంలో మదుపుచేసే వివిధ మార్గాల్లో పలువురు ఆభరణాల్ని ఎంచుకుంటుంటారు. బంగారం స్వచ్ఛతను కొలిచే సాధనాన్ని క్యారట్‌గా వ్యవహరిస్తారు. వివిధ రకాల క్యారట్లలో ఆభరణాల్ని రూపొందిస్తారు. పూర్తి స్వచ్ఛత కలిగిన బంగారం 24 క్యారెట్లుకాగా, అది సున్నితమైనందున ఆభరణాల తయారీలో దానికి మరో లోహాన్ని కలుపుతారు. అప్పుడు బంగారం క్యారెట్లు తగ్గుతాయి. ఎక్కువగా జ్యువెలరీ తయారీకి 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. అంటే అందులో 91.6 శాతం బంగారం ఉంటుందన్న మాట. 18 క్యారెట్లు, 14 క్యారెట్ల ఆభరణాలు సైతం మార్కెట్లో లభిస్తాయి. పూర్తి స్వచ్ఛత కలిగిన బంగారంకంటే 22 క్యారెట్ల ధర తక్కువగానూ, 18, 14 క్యారెట్లు మరింత తక్కువగానూ ఉంటుంది.
తయారీ నైపుణ్యం
ఆయా ఆభరణాల తయారీకి జ్యువెలర్స్ అవలంబించే విధానాలకు అనుగుణంగా మేకింగ్ ఛార్జీలు ఉంటాయి. యంత్రాల ద్వారా రూపొందేవాటికి, హస్తకళా నైపుణ్యం ద్వారా తయారయ్యే వాటికి ఛార్జీల వ్యత్యాసం ఉంటంది. అలాగే ఆభరణంలో వాడే వజ్రాలు, పొడులు, రాళ్లు తదితరాల కారణంగా వివిధ జ్యువెలర్స్ దుకాణాల్లో ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి.
వివిధ జ్యువెలరీ బ్రాండ్స్
బంగారం ధరలు (ఏప్రిల్ 20)
జ్యువెలర్ బంగారం ధర
రూపాయల్లో
తనిష్క్ 7,004
మలబార్ గోల్డ్ 6,805
జాయ్‌అలుకాస్ 6,805
కళ్యాణ్ జ్యువెలర్స్ 6,815 (ఏప్రిల్ 19)






