జీవవైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, ఆగస్టు 3(విజయ క్రాంతి) : మెదక్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆధ్వర్యంలో విదేశీ కలుపు మొక్కల నిర్మూలన కార్యక్రమం ఈకో ఫాన్ సొసైటీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టరేట్లో విదేశీ దురాక్రమణ కలుపు మొక్కల (Invasive Alien Weeds) గుర్తింపు, అవగాహన మరియు నిర్మూలన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్,జిల్లా అదనపు కలెక్టర్ నగేష్,అధికారులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో పెరిగిన విదేశీ దురాక్రమణ కలుపు మొక్కలను గుర్తించి తొలగించారు. ఈ సందర్భంగా ఈకో ఫాన్ సొసైటీ ప్రత్యేక గుర్తింపుగా రూపొందించిన ‘థంబ్స్ డౌన్ (Thumbs Down)‘ సంకేతాన్ని అందరూ ప్రదర్శించారు. ఈ సంకేతం విదేశీ దురాక్రమణ కలుపు మొక్కల వ్యాప్తిని నిరసిస్తూ, వాటిని పూర్తిగా నిర్మూలించి స్థానిక జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలనే సామూహిక సంకల్పానికి ప్రతీకగా నిలిచింది.
ఈ సందర్భంగా మెట్టు సాయి సంపత్, ముఖ్య కార్యనిర్వాహక అధికారి (Chief Executive Officer), ఈకో ఫాన్ సొసైటీ మాట్లాడుతూ.. విదేశీ దురాక్రమణ కలుపు మొక్కలు వ్యవసాయ దిగుబడులను తగ్గించడం, సాగుభూములను ఆక్రమించడం, చెరువులు, కుంటలు, కాలువలు వంటి జలవనరులను దిగ్బంధించడం, అడవుల్లో స్థానిక వృక్షజాతులను అణచివేయడం, జీవవైవిధ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయడం, కార్చిచ్చుల ప్రమాదాన్ని పెంచడం, రైతులు మరియు గ్రామీణ ప్రజల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించారు.
ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రజలు సమన్వయంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.తలారి విక్రమ్.., రాష్ట్ర సమన్వయకర్త, ఈకో ఫాన్ సొసైటీ మాట్లాడుతూ తెలంగాణలో విస్తృతంగా వ్యాపిస్తున్న ప్రధాన విదేశీ దురాక్రమణ కలుపు మొక్కలను గుర్తించే విధానాన్ని వివరించారు. ప్రతి ప్రభుత్వ శాఖ తమ కార్యాలయ ప్రాంగణాల్లో నిరంతరం గుర్తింపు, నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రారంభ దశలోనే వాటిని తొలగించడం ద్వారా వాటి విస్తరణను సమర్థవంతంగా అరికట్టవచ్చని సూచించారు.
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఈకో ఫాన్ సొసైటీ చేపడుతున్న ఈ వినూత్న కార్యక్రమాన్ని అభినందించారు. జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో పాల్గొనాలని, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలను విదేశీ దురాక్రమణ కలుపు మొక్కల రహితంగా ఉంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
కార్యక్రమం ముగింపులో విదేశీ దురాక్రమణ కలుపు మొక్కల నిర్మూలనకు నిరంతరం కృషి చేయాలని, జీవవైవిధ్య పరిరక్షణ సందేశాన్ని సమాజంలోని ప్రతి వర్గానికి చేరవేయాలని పాల్గొన్న వారందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ , కలెక్టరేట్ లోని ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






