బీజేపీ నేరాల మాఫీకే చట్టం
ప్రశ్నపత్రాల నేర నిరోధ చట్టంపై ఖర్గే
న్యూఢిల్లీ, జూన్ 22: ప్రశ్నపత్రాల లీక్‌లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తెచ్చి.. తన నేరాలను కడిగేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. గత ఏడేండ్లలో 70 ప్రశ్నపత్రాలు లీకయ్యాయని, ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వం వాటిపై ఏ చర్యలూ తీసుకోలేదని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘నీట్ స్కాంలో బీజేపీ పాత్ర ఎంతన్నది విషయం కాదు. విద్యా మాఫియా, అవినీతి, మోసం నుంచి ఆ పార్టీ తప్పించుకోలేదు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ రాష్ట్రపతి ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీనే ఆమోదించారు.
కానీ, బీజేపీ ప్రభుత్వం దానిని ఇంత ఆలస్యంగా శుక్రవారం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టాన్ని నోటిఫై చేసినట్టు మోదీ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి చెప్పారు. ఈ చట్టానికి సంబంధించిన రూల్స్‌ను న్యాయశాఖ రూపొందించకుండానే నోటిఫై చేసినట్టు విద్యాశాఖ మంత్రి అబద్ధం ఎందుకు చెప్పారు? నీట్ పేపర్ అసలు లీక్ కానేలేదని విద్యాశాఖ మంత్రి మొదట వాదించారు. గుజరాత్, బీహార్, హర్యానాలో నిందితులు అరెస్టు కాగానే మాట మార్చి.. కొన్నిచోట్ల లీకైనంత మాత్రాన అందరికీ మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని అంటున్నారు. 2015లో ప్రీమెడికల్ పరీక్షలో 44 మంది విద్యార్థులు అక్రమాలకు పాల్పడితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం ఆరు లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. పరీక్ష నిర్వహణలో అక్రమాలు నిజమేనని విద్యాశాఖ మంత్రి స్వయంగా ఒప్పుకొన్నా మోదీ ప్రభుత్వం నీట్‌ను రద్దుచేసి మళ్లీ ఎందుకు నిర్వహించటంలేదు? ’ అని ధ్వజమెత్తారు.






