16 April, 2026 | 2:44 AM

విద్యుత్ కార్మికుల సమ్మెకు బీజేపీ సంఘీభావం

16-04-2026 01:06 AM

సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు

హనుమకొండ, ఏప్రిల్ 15(విజయక్రాంతి): హనుమకొండ నక్కలగుట్ట ఎన్పీడీసీఎల్ కార్యాలయం వద్ద గత 8 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్, అన్మాడ్ కార్మికుల సమ్మెకు బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్య క్షులు ఎన్.రామచందర్‌రావు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎనిమిది రోజులుగా విద్యుత్ కార్మికులు సమ్మె చేస్తున్నా రేవంత్ రెడ్డి  ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్మికుల సమస్యలను పెడచెవిన పెడుతుందని ఆరోపించారు. అధికారంలోకి రాకముందుకు ఒకలా మాట్లాడి, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయనున్నట్లు తెలిపారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యు త్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో కార్మికులతో కలిసి బీజేపీ ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాళీ ప్రసాద్‌రావు, సండ్ర మధు, అన్మాన్యుడ్ కార్మికుల సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు మాట్ల బిక్షపతి, రాంబాబు, ప్రసాద్, రవి, సతీష్ పాల్గొన్నారు.

డీలిమిటేషన్‌పై తప్పుడు ప్రచారం

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావాలనే తప్పుడు ప్రచారానికి తెరలేపారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. బుధవారం వరంగల్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు. సీట్ల పెంపు అనేది 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరుగుతుందని, ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల్లో గందరగోళం సృష్టించేలా మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నారు మండిపడ్డారు. గతంలో మతం, కులం పేరుతో దేశా న్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు సీఎం ద్వారా ‘ఉత్తర అంటూ ప్రాంతీయ చిచ్చు పెడుతూ దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవ డానికే కాంగ్రెస్ విద్వేష రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ దృష్టిలో దేశమంతా ఒకటేనని, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏ ప్రాంతానికి, ఏ వ్యక్తికి అన్యాయం జరగదని అందరికీ సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.