బీజేపీ బీసీల పార్టీ
- నా పుట్టుక ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలోనే
- మోదీ కులంపై రేవంత్ విమర్శలు సరికాదు
- బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): తన రాజకీయ ప్రస్థానం ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలోనే ప్రారంభమైందని.. వెంకయ్యనాయుడు సహా ఎంతోమంది బీజేపీ సీనియర్లతో కలిసి అనేక పోరాటాలు చేసినట్టు బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. మోదీ పక్కా బీసీ అనీ, ఆయన ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీ పూర్తిగా బీసీల పార్టీగా మారిపోయిందన్నారు. బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆదివారం తొలిసారి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ ఒక యోగి అని.. అంతటి గొప్ప వ్యక్తి కులంపై రేవంత్‌రెడ్డి లేనిపోని విమర్శలు చేస్తున్నారని.. ఇది ముమ్మాటికీ సరికాదన్నారు. మోదీ ప్రధాని అయ్యాక భారత కీర్తి ప్రతిష్ఠలు ఖండాంతరాలు దాటాయని... అమెరికా కూడా భారత్‌కు పట్టం కడుతోందని, గతంలో ఎప్పుడూ ఇంతటి ఖ్యాతి రాలేదని అన్నారు. తెలంగాణలో రాబోయ్యేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి భారీగా నిధులు వచ్చి స్వర్ణ తెలంగాణగా మారుతుందన్నారు.
ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును దేశవ్యాప్తంగానూ ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మిగులు నిధులున్న రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పులకుప్పగా మార్చాయని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని, వారికే నిర్ణయాధికారం ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.
బీసీ కులగణనను కాంగ్రెస్ సమర్థించుకుంటోందని.. కానీ ఓటర్ లిస్ట్, విద్యార్థులు, చిన్న పిల్లలు మొత్తం కలిపితే తెలంగాణ జనాభా 4 కోట్లు దాటుతుందన్నారు. ఆధార్ కార్డుల ప్రకారం చూసుకున్నా 3.8 కోట్ల మంది ఉన్నారని... కానీ కులగణనలో తప్పుడు లెక్కలు చూపించారని విమర్శించారు. ప్రతీ చిన్న పనికి మీడియాలో ప్రకటనలు ఇచ్చి గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్... కులగణన అద్భుతమని భావిస్తే యాడ్స్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పలువురు బీసీ సంఘాల నాయకులు, వివిధ పార్టీలకు చెందిన వారు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.




