12 August, 2026 | 11:04 PM

గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

12-08-2026 09:43 PM

టీఎస్ యుటిఎఫ్ డిమాండ్

ఏన్కూర్,(విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూలపోచారంలో పోస్ట్ కార్డు క్యాంపెయిన్ లో భాగంగా సీఎంకు సమస్యలపై సంతకాల సేకరణ చేసి పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్. నాగేశ్వరరావు మాట్లాడుతూ 1970 దశకంలో గిరిజన సంక్షేమ శాఖ యాజమాన్యంలో ప్రారంభమైన పాఠశాలలు మారుమూల ఏజెన్సీ, గిరిజన గ్రామాల్లో ఎందరో గిరిజన విద్యార్థులకు మంచి విద్యను అందించి వారి ఉన్నతికి కారణమైన పాఠశాలలు,నేడు తీవ్ర నిర్లక్ష్యానికి  గురవుతున్నాయన్నారు.

అందులో పని చేస్తున్న ఉపాధ్యాయులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. రెసిడెన్షియల్,గురుకులాలపై చూపుతున్న శ్రద్ధ,పెడుతున్న ఖర్చులో కనీసం కొంచెమైనా గిరిజన సంక్షేమ పాఠశాలలపై పెడితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రభుత్వ,జిల్లా పరిషత్ పాఠశాలల్లో వేలాది పండిట్స్, పీఈటీ పోస్టులు అప్గ్రేడ్  చేసి పదోన్నతి కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350 నుండి 400మంది పండిట్స్, పీఈటీ పోస్టులను నేటికీ అప్ గ్రేడ్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ గిరిజన ఉపాధ్యాయులపై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నదని మండిపడ్డారు.

ఇప్పటికైనా పండిట్స్,పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్ చేసి ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలన్నారు. కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలు ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తి అయినా నేటికీ ఒక్క పోస్టు మంజూరు చేయకుండ తాత్కాలిక ఉపాధ్యాయులతో నడిపించటం దారుణమన్నారు. వెంటనే కన్వర్టెడ్ పాఠశాలలకు పోస్టులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిగిలిన హాస్టల్స్ ను ఆశ్రమ పాఠశాలలుగా కన్వర్ట్ చేయాలన్నారు. గిరిజన సంక్షేమ పాఠశాలలకు పర్యవేక్షణ అధికారులు ట్రైబల్ ఎంఈఓ,ట్రైబల్ డిప్యూటీ డిఇఓ, పిఎంఓ, ఏసిఎంఓ పోస్టులను మంజూరు చేయాలని, జేఎల్ గా పదోన్నతి కల్పించాలని,  గిరిజన ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు స్కూల్ గ్రాంట్లు మంజూరు చేయాలని, ఆశ్రమ పాఠశాలలకు కంప్యూటర్ ఫ్యాకల్టీ, ఏఎన్ఎం లను మరియు స్కావెంజర్ పోస్టులను నియమించాలన్నారు.

ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సి.ఆర్.టి లకు బేసిక్ పే ఇవ్వాలని, వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు. సీఎంగా మీరు పై సమస్యలపై జోక్యం చేసుకొని గిరిజన సంక్షేమ రంగంలోని పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిస్తారనే నమ్మకంతో ఈ లేఖ ద్వారా మా సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నామని, వెంటనే స్పందించి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.నాగరాజు, సీనియర్ ఉపాధ్యాయులు బి.శోభన్,బి.రవి,వి. రమేష్, పి.శ్రీనివాస్, కే.శ్యామల, బి.రవి (హిందీ) బి.సక్రాం,జె. నాగేశ్వరరావు, నాగమణి,డి.ఉషశ్రీ, నలిని,కపూర్య తదితరులు పాల్గొన్నారు.