15 July, 2026 | 5:19 AM

బీజేపీది అగ్రకుల రాజకీయం

22-06-2024 12:05 AM

ప్రొటెం స్పీకర్ నియామకంపై పినరయి విజయన్

తిరువనంతపురం, జూన్ 21: బీజేపీ అగ్రకుల రాజకీయాలకు పాల్పడుతూ పార్లమెం టరీ సంప్రదాయాలను మంటగలుపుతున్నదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ భర్తృహరి మహాపాత్రను నియమించటంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రస్తుత లోక్‌సభలో అత్యంత సీనియర్ సభ్యుడు కాంగ్రె స్‌కు చెందిన కొడికున్నిల్ సురేశ్. ఆయన ఇప్పటివరకు 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మహాపాత్ర ఏడుసార్లు మాత్రమే ఎన్నికయ్యారు.

పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం లోక్‌సభలో అత్యంత సీనియర్ సభ్యుడిని రాష్ట్రపతి ప్రొటెంస్పీకర్‌గా నియమిస్తారు. కానీ, ఈసారి సీనియర్‌ను కాదని మరొకరిని నియమించారు. సంఘ్‌పరివార్ అగ్రకుల రాజకీయాల మూలంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నదని విజయన్ ఆరోపించారు. సురేశ్ దళిత వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన కేరళలోని మావెలిక్కర లోక్‌సభ స్థానం నుంచి ఇటీవల 8వ సారి ఎంపీగా గెలిచారు. ప్రొటెంస్పీకర్ నియామకంపై కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ‘మీరు ఎన్నికల్లో ఓడిపోయారు. మేం గెలిచాం. ఆ విషయం మర్చిపోవద్దు’ అని పేర్కొన్నది.