15 July, 2026 | 5:12 AM

ఆ రహస్య స్నేహితుడెవరు?

22-06-2024 12:05 AM
  1. భారత వ్యతికుల ఒక్కొక్కరిగా హతం
  2. పాకిస్థాన్, కెనడాలో టెర్రర్ గుండెల్లో భయం
  3. వరుస హత్యలతో హడలెత్తిస్తున్న గ్యాంగులు

న్యూఢిల్లీ, జూన్ 21: ఒకప్పుడు భారత్‌లో ఉగ్రవాద దాడులు జరిగితే ‘నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం’ అనే రొటీన్ ప్రకటలు వినిపించేవి తప్ప ఒక్క ఉగ్రవాదిని కూడా శిక్షించిన దాఖలాలు కనిపించేవి కావు.  కానీ కాలం మారింది. ఆ ఉగ్రవాదులను అప్పగించాలని భారత్ పదేపదే ఇప్పుడు ఏ దేశాన్నీ అడగటం లేదు. అలాగని ఆ ముష్కరులు ప్రశాంతంగా బతకటం కూడా లేదు. రోజుకో ఉగ్రవాది తుపాకీ గుళ్లకు బలవుతున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్, కెనడాలో భారత వ్యతిరేక ఉగ్రవాదుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయి. మన చేతికి మట్టి అంటకుండా ఈ కార్యక్రమం ఎలా సాగుతున్నది? సాయం చేస్తున్న అజ్ఞాత స్నేహితులు ఎవరు? 

ఖలిస్థానీలపై కదనం

పాకిస్థాన్ ఉగ్రవాదులతోపాటు సిక్కు ఖలిస్థానీ ఉగ్రవాదులు కూడా ఇదే రీతిలో హతమవుతున్నారు. ఏడాది క్రితం కెనడాలో సిక్కు ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత నిజ్జర్‌ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మరో ఖలిస్థానీ ఉగ్రవాది పొన్నున్ అమెరికాలో ఉన్నప్పుడు హత్యాయత్న జరిగింది. అతడు తృటిలో తప్పించుకొన్నాడు. ఆస్ట్రేలియాలో కూడా ఖలిస్థానీ ఉగ్రవాదుల వేట కొనసాగుతున్నది. ఇటీవలే ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రధాని నరేంద్రమోదీ ‘ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా వారి ఇంట్లోకి చొరబడి మరీ అంతమొందిస్తాం’ అని పదేపదే ప్రకటించారు. ఆ మధ్య బ్రిటన్ పత్రిక గార్డియన్ ఈ హత్యలపై ఓ కథనాన్ని ప్రచురించింది. భారత ప్రభుత్వమే ఈ హత్యలు చేయిస్తున్నదని పాకిస్థాన్ అధికారవర్గాలను ఉటంకిస్తూ కథనం రాసింది. దానిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. 

మన ఏజెంట్ల పనేనా?

విదేశాల్లో నిఘా వ్యవహారాలు చూసే రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం పరిధిలో ఉంటుంది. దశాబ్దాలుగా ఈ సంస్థ అనేక దేశాల్లో నిఘా సమాచారం సేకరించే పని మాత్రమే చేసేది. కౌంటర్ దాడులు చేసిన సందర్భాలు చాలా తక్కువ. గార్డియన్ కథనం ప్రకారం పాకిస్థాన్‌లో ఉగ్రవాదులను అంతం చేస్తున్నది రానే అని ఆ దేశ సైనికాధికారులు బలంగా నమ్ముతున్నారు. కానీ, చాలామంది అంతర్జాతీయ నిఘా నిపుణులు ఈ ఆరోపణలను నమ్మటం లేదు. మరి ఈ దాడులు చేస్తున్నదెవరు అన్న ప్రశ్నకు చాలామంది ఇజ్రాయెల్ నిఘా సం స్థ మొస్సాద్ వైపు వేలు చూపిస్తున్నారు. మోటార్ సైకిళ్లపై వెంటాడి లక్షిత వ్యకుతలను కాల్చి చంపి మెరుపు వేగంతో మాయ మవటం మొస్సాద్ స్టుల్. పాకిస్థాన్‌లో ఉగ్రవా దుల ఏరివేతకు కూడా భారత నిఘా వర్గాలు మొస్సాద్ సహాయం తీసుకొన్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

నాలుగేండ్లలో 20 మంది హతం

ఒకప్పుడు భారత్‌పై యుద్ధానికి కాలు దువ్విని పాకిస్థాన్ ఉగ్రవాదులు ఇప్పుడు ఒక్కొక్కరుగా అనామకంగా మట్టిలో కలిసిపోతున్నారు. 2020 నుంచి వరుసగా ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు. వీరిలో పాకిస్థాన్ మాజీ సైనికులు కూడా ఉన్నారు. పాక్ రిటైర్డ్ బ్రిగేడియర్ ఆమిర్ హంజాను పంజాబ్‌లోని (పాకిస్థాన్) జీలంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇతడు 2018లో భారత్‌లోని సంజువాన్ సైనిక స్థావరంపై ఉగ్రదాడికి పథకం రచించాడని భారత్ ఆరోపించింది.

ఆ తర్వాత లష్కరే తోయిబా, జైష్ ఏ మహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 20 మందిని బైక్‌లపై వచ్చిన వ్యక్తులు కాల్చచంపి మెరుపు వేగంతో మాయమయ్యారు. ఈ హత్యలన్నీ ఒకే రీతిగా జరుగటం గమనార్హం. హతమైన ఉగ్రవాదుల్లో లష్కర్ ఏ తోయిబా అగ్రనేత ఖ్వాజా షహీద్ కూడా ఉన్నాడు. ఈ హత్యలతో ఉగ్రవాదుల్లో వణుకు మొదలైంది. ఒకప్పుడు పాకిస్థాన్‌లో బహిరంగంగానే సభలు నిర్వహించిన ఉగ్ర సంస్థల అధినేతలు, ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.