7 July, 2026 | 10:25 PM

బ్లాక్‌స్టోన్ చేతికి హల్దిరామ్ స్నాక్స్!

15-05-2024 12:05 AM

74.7 శాతం వాటా కొనుగోలుకు బిడ్

న్యూఢిల్లీ, మే 14: స్నాక్స్ వ్యాపారంలో పేరొందిన హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయ ఈక్విటీ ఫండ్ బ్లాక్‌స్టోన్ నేతృత్వంలోని కన్సార్షియం బిడ్ చేసినట్టు ఎకనామిక్ టైమ్స్ తాజా కథనంలో వెల్లడించింది. ఈ కన్సార్షియంలో అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడుల సంస్థ జీఐసీలు ఉన్నా యి. 87 ఏండ్లుగా నడుస్తున్న ఈ హల్దిరామ్ గ్రూప్‌లో ఒక భాగమైన ఢిల్లీ, నాగపూర్‌ల్లోని అగర్వాలా కుటుంబం హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నిర్వహిస్తున్నది. ఈ కంపెనీలో 74.76 శాతం వాటాకు బ్లాక్‌స్టోన్, దాని భాగస్వాములు గత వారంలో బిడ్ సమర్పించినట్టు సమాచారం. కంపెనీకి 8 బిలియన్ డాలర్ల విలువ కడుతూ (రూ.66,400 కోట్లు) బిడ్డింగ్ జరిగింది. అయితే ఈ అంశమై వ్యాఖ్యానించేందుకు హల్దిరామ్ సీఈవో కెకె చుతాని నిరాకరించారు.

హల్దిరామ్ కుటుంబం రెండు భాగాలుగా విడిపోయింది. అందుకు అనుగుణంగా వారి ప్యాకేజ్డ్ ఫుడ్స్ వ్యాపారాన్ని, రెస్టారెంట్ వ్యాపారాన్ని రెండుగా విభజించారు. అటుతర్వాత నాగపూర్‌లో ఉంటున్న కుటుంబం చేతికి హల్దిరామ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీలో ఉంటున్న కుటుంబం చేతిలో ఉన్న హల్దిరామ్ స్నాక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లను విలీనం చేసి హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. విలీన కంపెనీలో ఢిల్లీ కుటుంబానికి చెందిన మనోహర్ అగర్వాల్, మధుసూదన్ అగర్వాల్‌లకు 55 శాతం వాటా ఉంటుంది. నాగపూర్ కుటుంబానికి చెందిన కమల్‌కుమార్ శివకిషన్ అగర్వాల్ వద్ద మిగిలిన 45 శాతం వాటా ఉంటుంది. హల్దిరామ్ వ్యాపారంలో ఉన్న మూడో కుటుంబం ఈ విలీన ప్రక్రియలో పాలుపంచుకోలేదు. ఈ కుటుంబం దేశంలోని తూర్పు ప్రాంతంలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది. 

100 దేశాల్లో.. 500 రకాల ఉత్పత్తులు

హల్దిరామ్ స్నాక్ ఫుడ్ కంపెనీ యూకే, యూఎస్, జపాన్‌లతో సహా దాదాపు 100 దేశాల్లో చాలావరకూ ఫ్రాంఛైజీల ద్వారా వ్యాపారం చేస్తున్నది. స్నాక్స్, నమ్‌కీన్, స్వీట్స్, రెడీ టు ఈట్, ప్రిమిక్స్ ఫుడ్, కుకీస్, బేవరేజెస్, పాస్తా తదితర విభాగాల్లో 500 రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్నది. కంపెనీకి మినిట్ ఖానా, కప్ షుప్, కుకీ హెవెన్ తదితర సబ్‌బ్రాండ్స్ ఉన్నాయి. కోకోబే పేరుతో ఈ ఏడాది జనవరిలో చాకోలేట్స్ తయారీలోకీ ప్రవేశించింది. బాబాజీ నమ్‌కీన్, అకాశ్ నమ్‌కీన్, ఎటాప్ ఫుడ్స్‌లతో సహా కొన్ని చిన్న బ్రాండ్లను సైతం హల్దిరామ్ కొనుగోలు చేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 14,500 కోట్ల ఆదాయాన్ని, రూ. 2,500 కోట్ల ఇబిటాను ఆర్జిస్తుందని అంచనా. తాజా బిడ్డింగ్ లావాదేవీలో కంపెనీ రెస్టారెంట్ వ్యాపారం ఉండదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పెప్సికో, కెల్లాగ్ తదితర అంత ర్జాతీయ కంపెనీలు, కొన్ని గ్లోబల్ ఈక్విటీ ఫండ్స్, టాటాలకు చెందిన టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ గతంలో వాటా కొనుగోలుకు హల్దిరామ్ కుటుంబంతో చర్చలు జరిపాయి. అయితే విలువ విషయమై అంగీకారం          కుదరలేదు.