మూడోరోజూ పెరిగిన మార్కెట్
సెన్సెక్స్ 328 పాయింట్లు జంప్
22,200 పాయింట్లపైకి నిఫ్టీ
ముంబై, మే 14: ఎన్నికల టెన్షన్‌తో గతవారంలో వరుస పతనాల్ని చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్ క్రమేపీ కోలుకుంటున్నది. లోక్‌సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ రోజైన సోమవారం ట్రేడింగ్ తొలిదశలో భారీగా పతమమై, చివరిగంటలో నాటకీయంగా కోలుకున్న స్టాక్ సూచీలు మంగళవారం సైతం అప్‌ట్రెండ్‌ను కొనసాగించాయి. మార్కెట్ గ్రీన్‌లో ముగియడం వరుసగా ఇది మూడవ రోజు. తాజాగా బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే మరో 328 పాయింట్లు లాభపడి 73,104 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 500 పాయింట్ల కుపైగా పెరిగి 73,286 పాయింట్ల గరిష్ఠస్థాయిని సైతం తాకింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 114 పాయింట్లు లాభపడి 22,200 పాయింట్ల ఎగువన 22,218 పాయింట్ల వద్ద ముగిసింది. హెవీవెయిట్ బ్లూచిప్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ఆటోమొబైల్, మెటల్ షేర్లలో ఇన్వెస్టర్లు తాజా కొనుగోళ్లు జరిపినట్టు ట్రేడర్లు చెప్పారు. మరోవైపు ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లలో అమ్మకాలు జరిగాయన్నారు.
పరిమితశ్రేణిలో ట్రేడింగ్
రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం, ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్‌కావడంతో దేశీయ సూచీలు క్రమేపీ కోలుకున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠస్థాయి 4.83 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే. అయితే సమీప భవిష్యత్తులో వొలటాలిటీ కొనసాగుతుందని, మార్కెట్ పరిమిత శ్రేణిలో ట్రేడవుతుందని అంచనా వేస్తున్నట్టు నాయర్ తెలిపారు.
ఆగని ఎఫ్‌పీఐల అమ్మకాలు
మూడు రోజుల నుంచి దేశీయ సంస్థల కొనుగోళ్లతో మార్కెట్ గ్రీన్‌లో ముగుస్తున్నా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. మంగళవారం సైతం విక్రయాలు జరిపారు. తాజాగా ఎఫ్‌పీఐలు రూ. 4,065 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నా యి. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి రూ. 27,000 కోట్లకుపైగా వెనక్కు తీసుకున్నారు.
టాప్‌గేర్‌లో ఎం అండ్ ఎం
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా 3.8 శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయి రూ.2,272 వద్ద ముగిసింది. లార్సన్ అండ్ టుబ్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి షేర్లు 1 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. నెస్లే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ 1 శాతం వరకూ నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా యుటిలిటీస్ ఇండెక్స్ 2.8 శాతం పెరిగింది. పవర్ ఇండెక్స్ 2.51 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 2.40 శాతం, టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ 2.27 శాతం, క్యాపిటల్ గూడ్స్ సూచి 2.11 శాతం, కమోడిటీస్ సూచి 1.87 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 1.78 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 1.52 శాతం, రియల్టీ సూచి 1.03 శాతం చొప్పున పెరిగాయి.






