30 August, 2026 | 7:12 PM

ఓటరు నమోదుపై అధికారుల కసరత్తు

30-08-2026 06:10 PM

ఇంటింటికీ నోటీసులు

అర్హులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి

నాగల్‌గిద్ద, ఆగస్టు 30(విజయ క్రాంతి): నాగల్ గిద్ద మండలంలోని పలు గ్రామాల్లో ఓటరు జాబితా సవరణ, నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు నోటీసులు అందజేస్తున్నారు. కారమంగి గ్రామపంచాయతీలో బీఎల్‌ఓలు కమలమ్మ, కళావతి ఇంటింటికీ నోటీసులు అందజేస్తూ ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. ఓటరు జాబితాలో పేరు లేని అర్హులు, వివరాల్లో మార్పులు ఉన్న వారు సరైన పత్రాలను సమర్పించి నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్లెవరూ తమ పేరు నమోదు ప్రక్రియను మిస్ కాకుండా అధికారులు సూచనలు చేస్తున్నారు.

మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రక్రియ సక్రమంగా జరిగేలా మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ప్రజలు అధికారులకు సహకరించి అవసరమైన పత్రాలను అందజేయాలని కోరుతున్నారు. ఈ ప్రక్రియను ఎమ్మార్వో సంగ్రాం రెడ్డి, ఆర్‌ఐ అనిల్ రెడ్డి, గ్రామపంచాయతీ అధికారులు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఓటరు జాబితాలో పేరు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.