గుట్ట గుడికి బోర్డు
- టీటీడీ తరహాలో స్వతంత్ర బోర్డు ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
- టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ
టెంపుల్, ఎకో, హెల్త్‌కు ప్రత్యేక విధానాలు
అనంతగిరిలో నేచర్ వెల్‌నెస్ సెంటర్
ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల్లో హెల్త్ హబ్
మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్
హైదరాబాద్ బయట మరో జూపార్క్
స్పీడ్ ప్రాజెక్టులపై సీఎం రివ్యూ
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): రాష్ర్టంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానానికి ప్రత్యేక ఆలయ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో ఈ బోర్డు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కొత్త పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.
ముఖ్యంగా ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. శుక్రవారం పర్యాటకం సహా స్పీడ్ ప్రాజెక్టులపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్, ఎకో టూరిజం ప్రాజెక్టులు, టెంపుల్ సర్క్యూట్‌ల అభివృద్ధిపై చర్చ జరిగింది. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం అభివృద్ధికి విడివిడిగా పాలసీలను రూపొందించాలని సీఎం నిర్ణయిం చారు. తెలంగాణలో ఉన్న ప్రాచీన ఆలయాలు, చారిత్రక స్థలాలతో పాటు అటవీ ప్రాంతాలు, వైద్య సదుపాయాలన్నింటినీ పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
రవాణా తోపాటు వసతి, పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయలు ఉండేలా కొత్త టూరిజం ప్యాకేజీలుండాలని తెలిపారు. కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటుచేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కొన్ని చోట్ల రాత్రి విడిది ఉండే కాటేజీలను నిర్మించాలని ఆదేశించారు.
పర్యాటకానికి అనువైన ప్రాంతాలన్నీ గుర్తించి, వేటిని ముందుగా అభివృద్ధి చేయాలనేది టూరి జం, దేవాదాయ, అటవీ శాఖ అధికారులు కలిసికట్టుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. కేవలం హరిత హోటళ్లు, వసతి గృహలు నిర్మించి వదిలేస్తే సరిపోదని.. నిరంతరం వీటి నిర్వహణ మెరుగ్గా ఉంటేనే పర్యాటకులు వస్తారని తెలిపారు. అందుకే కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని సూచించారు. అటు ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ర్ట అభివృద్ధికి ఉపయోగపడేలా టూరిజం అభివృద్ధి జరగాలని స్పష్టం చేశారు.
అవసరమైతే జిందాల్ ప్రతినిధులతో చర్చలు
హైదరాబాద్ బయట దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకువచ్చి కొత్త జూ పార్క్‌లో ఉంచాలని, అర్బన్ ఫారెస్ట్రీని అభివృద్ధి చేయాలని అన్నారు. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. అలా ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలను కూడా ఆహ్వానించాలని సూచించారు.
అనంతగిరి ప్రాంతంలో అద్భుతమైన ప్రకృతి అటవీ సంపద ఉందని, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని అధికారులకు సూచించారు. బెంగళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్‌స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్‌నెస్ సెంటర్ అక్కడ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు జిందాల్ ప్రతినిధులు ఆసక్తిగా ఉంటే సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. ప్రకృతి వైద్య రంగంలో పేరొందిన ప్రముఖ సంస్థలను ఆహ్వానించాలని సూచించారు.
యాదగిరిగుట్టకు స్వయం ప్రతిపత్తి బోర్డు
టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలపై సీఎం ఆరా తీశారు. ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్థంత రంగా వదిలేయడానికి వీలులేదని స్పష్టం చేశారు.
ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని అన్నారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పెండింగ్ పనుల నివేదికను వారం రోజుల్లో తనకు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టీటీడీ అనుసరించిన తరహాలోనే యాదగిరిగుట్ట బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని సూచించారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలు, విడిదికి కాటేజీలు నిర్మాణానికి దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని కోరారు.
హెల్త్ సిటీలోని సంస్థలకు ప్రోత్సాహకాలు
కీసర గుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి అన్నారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా.. అచ్చం అదే నమూనాతో కీసరగుట్ట ఆలయాన్ని నిర్మించాలని అధికారులకు సూచించారు. అక్కడ ఉపయోగించిన శాండ్‌బాక్స్ టెక్నాలజీ జోలికి వెళ్లవద్దని.. ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర ఆలయం పునర్నిర్మాణం చేపట్టాలని అన్నారు. హైదరాబాద్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న హెల్త్ సిటీలో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
ఇక్కడ సెంటర్లు నెల కొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త పాలసీ తయారు చేయాలని సూచించారు. వివిధ దేశాల నుంచి వచ్చేవారికి వైద్య సేవలందించే వన్‌స్టాప్ సొల్యూషన్ ప్యాకేజీలు రూపొందించాలని కోరారు. ఆన్‌లైన్‌లోనే అన్ని సేవల వివరాలను అందుబాటులో ఉంచాలని, నేరుగా ఎయిర్ పోర్ట్ నుంచి హాస్పిటల్‌కు వెళ్లి, డాక్టర్ల అపాయింట్మెంట్, ట్రీట్మెంట్ తీసుకునేలా సదుపాయాలన్నీ ఉండాలని సూచించారు. దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని అన్నారు.
సమీక్షలో టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, టూరిజం ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిష్టియానా, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియల్‌తో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






