మార్చి నాటికి దేవాదుల
- ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సోనియా వస్తారు
- ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం దేవాదుల ప్రాజెక్టుకే
అదనంగా సేద్యంలోకి 89, 312 ఎకరాల భూమి
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు
తుదిదశకు చేరుకొన్న ఫేజ్ 3 పనులు
ఇరిగేషన్ శాఖను అడ్డం పెట్టుకుని కేసీఆర్ దోపిడీ
ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల కుంభకోణం
నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
హనుమకొండ/యాదాద్రిభువనగిరి, ఆగస్టు 30 (విజయక్రాంతి): వచ్చే ఏడాది మార్చి నాటికి దేవాదుల ప్రాజె క్టు పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలి పారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ వస్తారని వెల్లడించారు.
మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఉత్తమ్ శుక్రవారం ములుగు జిల్లాలోని జే చొక్కారావు దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు ఇన్‌టెక్ పంప్‌హౌస్‌ను పరిశీలించారు. పంపింగ్ స్టేషన్ వద్ద దేవాదుల, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్ట్‌కు 2008లో శంకుస్థాపన చేశారని, దీనిని 2026 మార్చి నాటికి పూర్తి చేసి గోదావరి జలాలతో ఉమ్మడి వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించాలన్న ప్రభుత్వ సంకల్పం మేరకు పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్‌వోసీ తీసుకొని సమ్మక్క సాగర్ బరాజ్‌లో నీరు నిల్వ చేస్తామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ బిల్లులు గ్రీన్‌ఛానల్ ద్వారా చెల్లిస్తామని అన్నారు. పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ కోసం ఇరిగేషన్ శాఖ బలోపేతం కోసం 700 మంది సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను, 18 వేల మంది ఇతర సిబ్బందిని ఔట్ సోర్సింగ్‌పై నియమించినట్లు ప్రకటించారు.
మొత్తం మూడు దశల్లో నిర్మాణం పూర్తి చేయాలన్న ప్రణాళికతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటికే భూసేకరణతో సహా 91 శాతం పనులు పూర్తి అయినట్లు వివరించారు. మిగిలిన పనులు పూర్తి చేసి 2026 మార్చి నాటికి 89 వేల 312 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. 2004 అప్పటి ప్రభుత్వం రూ.6,016 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్‌ను కాలక్రమంలో ఫేజ్ 2, ఫేజ్ 3లుగా విస్తరించడంతో రూ.17, 500 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇప్పటివరకు రూ.14,188 కోట్ల ఖర్చు చేసినట్టు వెల్లడించారు.
కేసీఆర్ దొంగే
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖను అడ్డం పెట్టుకొని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్లు దోపిడీ చేశారని ఉత్తమ్ విమర్శించారు. గత పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులకు రూ.౧.౮౧ లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుకు మేలు చేసే సర్కార్ అని అన్నారు. రైతులకు అన్ని విధాలుగా సహాయం అందించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు బిల్లులు గత ప్రభుత్వంలో రూ.14 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి రాగానే రూ.7 వేల కోట్లు మం జూరు చేసినట్లు తెలిపారు. మిగిలిన అన్ని పెండింగ్ బిల్లులు త్వరలో విడుదల చేస్తామని చెప్పారు.
తలాపున గోదారున్నా తడి లేదు
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో నీళ్లు రాలేదని, నియామకాలు జరగలేద మంత్రి సీతక్క అన్నారు. గోదావరి నద తలాపున ఉన్నా కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట మండలాలకు దేవాదుల నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ములుగు జిల్లాలో పెద్దపెద్ద చెరువులు ఉన్నా ఎండాకాలం వచ్చిందంటే ఎండిపోతున్నాయని తెలిపారు. దేవాదుల పంప్ హౌస్ ద్వారా ములుగు జిల్లాలోని అన్ని చెరువులకు నీరు అందిస్తే రైతులు బాగుపడతారని, అందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, నాగరాజు, గండ్ర సత్యనారాయణ, కడియం శ్రీహరి, యశస్విని, రేవూరి ప్రకాష్ రెడ్డి, మురళీ నాయక్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను గుర్తుపట్టని పోలీసులు
మంత్రుల పర్యటన సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు చేదు అను భవం ఎదురైంది. ఉత్తమ్, పొంగులేటికి ఆహ్వానం పలికేందుకు వెళుతున్న వేముల వీరేశంను పోలీసులు గుర్తుపట్టలేదు. ఆయనను కూడా సాధారణ వ్యక్తుల మాదిరిగా ఆపడంతో అక్కడి నుంచి అసహనంతో వెనుదిరిగారు. కార్యకర్తలు ‘అన్నా.. అన్నా.. వీరేశ్ అన్నా..’ అని పిలుస్తున్నా వినిపించుకోలేదు. అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. ‘పోలీసులకు కామన్‌సెన్స్ లేదు.. ఎవరు ఎమ్మెల్యేనో కూడా తెలియడం లేదు’ అని మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యేకు అవమానం జరిగిందంటూ పలువురు విమర్శిస్తున్నారు.
నల్లగొండను సస్యశ్యామలం చేస్తాం
సాగునీటి కాల్వల నిర్మాణం పూర్తి చేసి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన సాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు అనాజీపురం వద్ద బునాదిగాని కాలువ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బునాది గాని కాల్వకు రూ.269 కోట్లు, పిల్లాయపల్లి కాల్వకు రూ.86 కోట్లు, ధర్మారెడ్డి కాల్వకు రూ.133 కోట్లు అవసరమని తెలిపారు.
అవసరమైన భూసేకరణ చేస్తే పనులు పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. హైదరాబాద్ నుంచి మూసీ ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. దేవాదుల నుంచి భువనగిరిలోని లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని అన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ మరో 45 రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు పోస్తామని తెలిపారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు సాగునీరు అందించాలని కోరారు.
ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ చింతపండు నవీన్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.






