హృదయ విదారకం
తల్లి కొడుకు మృతదేహాలు లభ్యం
మహబూబాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా వర్ధన్న పేట మండలం కట్రియాల గ్రామంలో మూడేళ్ల వయసుగల కుమారుడితో కలిసి ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలో గల్లంతైన తల్లి కుమారుడి మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. కట్య్రాల గ్రామానికి చెందిన కళ్యాణి అనే వివాహిత తన మూడేళ్ల కుమారుడు శ్రేహా న్స్ తో కలిసి శనివారం ఉదృతంగా ప్రవహిస్తున్న ఎస్సారెస్పీ కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
సంఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు, ఎస్ ఆర్ ఎస్ పి నీటి ప్రవాహాన్ని తగ్గించి, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా ఆదివారం మధ్యాహ్నం ఇల్లంద గ్రామ శివారు కుమ్మరిగూడెం తండా కు వెళ్లే రహదారి పక్కన ఎస్సారెస్పీ కాలువలో లభ్యం అయ్యాయి. కొడుకు తనతో పాటే చనిపోయే విధంగా కళ్యాణి తన చున్నీకి కొడుకును కట్టుకొని కాలువలోకి దూకినట్లు భావిస్తున్నారు. హృదయ విదారక దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




