21-02-2026 12:00:00 AM
ఎంపీ ఈటల రాజేందర్
మేడ్చల్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నందున బొల్లారం రైల్వే స్టేషన్ ను అమృత్ స్టేషన్ తరహాలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. నిజామాబాద్ తిరుపతి మధ్య నడిచే రాయలసీమ ఎక్స్ప్రెస్ కు బొల్లారం స్టేషన్లో హాల్ట్ కల్పించిన నేపథ్యంలో శుక్రవారం రైలుకు జెండా ఊపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సికింద్రాబాద్, కాచిగూడ ప్రధాన రైల్వేస్టేషన్లో అధిక రద్దీతో ఇబ్బంది ఏర్పడిందని అన్నారు. నగరంలో రైళ్లను బయట నిలిపేందుకు తగిన స్థలం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా టెర్మినల్స్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇటీవల చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను రూ. 450 కోట్ల వ్యయంతో టర్మినల్ నిర్మాణం చేపట్టామని, అదే తరహాలో ఉత్తర హైదరాబాద్ కు గుండెకాయ లాంటి బొల్లారం రైల్వే స్టేషన్ ను కూడా అభివృద్ధి చేయాలని సంకల్పించామన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖలతో సమన్వయం చేసి బొల్లారం రైల్వే స్టేషన్ సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఈటల అన్నారు.