వరదొచ్చినా వృథానే!
- ఈ సీజన్‌లోనూ కాళేశ్వరంలో నీటి నిల్వలకు బ్రేక్
- కొనసాగుతోన్న సాంకేతిక పరీక్షలు
- నవంబర్ వరకు అధ్యయనాలు
- నిపుణుల సూచనల తర్వాతే మరమ్మతులు
- 2027 వేసవికే ప్రాజెక్టు పునరుద్ధరణ!
- వినియోగానికి దూరంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టు కిందకు వచ్చే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో ఈ సీజన్‌లోనూ నీటి నిల్వకు బ్రేక్ పడనుంది. బ్యారేజీలలో కొనసాగుతోన్న సాంకేతిక పరీక్షల దృష్ట్యా నీటిని నిల్వ చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసంది. తుది నివేదికలు మరియు శాస్త్రీయ పునరుద్ధరణ పూర్తయ్యే వరకు యధాస్థితి కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడేళ్లుగా మేడిగడ్డలో సాధారణ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఈ వానాకాలం కూడా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజీ అత్యంత కీలకమైనది. గోదావరి జలాలను మొదటగా మేడిగడ్డ బ్యారేజీలోనే నిల్వ చేస్తారు. ఇక్కడి నుంచి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు, అనంతరం రిజర్వాయర్లకు ఎత్తిపోస్తారు.
2023లో మేడిగడ్డ బరాజ్ పియర్లు కుంగిన ఘటన అనంతరం సాంకేతిక పరీక్షలు ప్రారంభించారు. ఈ పరీక్షలు ఇప్పటికీ కొనసాగతున్నాయి. ప్రస్తుతం అధ్యయనాల ఫలితాలు, కేంద్ర సంస్థల సూచనల మేరకే ప్రాజెక్టు భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
క్షేత్ర పరిశీలనలకు అంతరాయం
మేడిగడ్డ బరాజ్ భద్రతకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఇంజినీరింగ్ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. పిల్లర్ల స్థితి, పునాది బలం, నది అడుగు భాగంలోని భౌగోళిక పరిస్థితులు, వరదల ప్రభావం, కాంక్రీట్ నాణ్యత వంటి అంశాలను విడివిడిగా పరిశీలిస్తున్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వద్ద కూడా సమాంతరంగా పరీక్షలు జరుగుతుండటంతో ప్రక్రియ మరింత సమయం తీసుకుంటోంది.
అంతేకాకుండా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ (ఎన్డీఎస్‌ఏ) సూచించిన అన్ని సాంకేతిక పరీక్షలను పూర్తి చేయాల్సి ఉండటంతో అధికారులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు వెళ్లడం లేదు.
మరోవైపు, గోదావరిలో నీటి ప్రవాహం, వర్షాకాల పరిస్థితులు కూడా ఫీల్ స్థాయి పరిశీలనలపై ప్రభావం చూపుతున్నాయి. ఒకసారి మరమ్మతులు చేపట్టిన తర్వాత మళ్లీ సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కనుగొనాలనే లక్ష్యంతో ప్రభుత్వం, నిపుణుల బృందాలు అత్యంత జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాయి.
2027 వేసవి వరకు ఆగాల్సిందేనా?
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వ లక్ష్యం 2027 వేసవి కాలంగా కనిపిస్తోంది. సాంకేతిక పరీక్షలు, భద్రతా అధ్యయనాలు, కేంద్ర సంస్థల అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాతే మరమ్మతు పనులు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిశీలనల ఆధారంగా సెప్టెంబర్ నాటికి పునరుద్ధరణ డిజైన్లను సిద్ధం చేసి, నవంబర్--డిసెంబర్‌లో పనులు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
అయితే సాంకేతిక నివేదికలు, ఎన్డీఎస్‌ఏ మరియు కేంద్ర జల సంఘం సూచనలపైనే ప్రాజెక్టు పునరుద్ధరణ గడువు ఆధారపడి ఉంటుంది. కాగా ఇప్పటికే మూడేళ్లుగా మేడిగడ్డలో నీటి నిల్వలు లేకపోవడం, ఈ వర్షాకాలం కూడా కోల్పోయే పరిస్థితి నెలకొంది.
మిగిలిన 25 శాతం పరిశీలనలే కీలకం
సాంకేతిక పరీక్షలు 75 శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నప్పటికీ, మిగిలిన 25 శాతం పరిశీలనలే అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు. ఇప్పటివరకు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం, పియర్ల స్థిరత్వం, పునాది పరిస్థితులపై తుది నిర్ధారణకు రావడం, వివిధ పరీక్షల ఫలితాలను సమన్వయం చేయడం వంటి ప్రక్రియలు ఇంకా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా పరీక్షల ఫలితాల ఆధారంగా సమగ్ర నివేదికను రూపొందించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ (ఎన్డీఎస్‌ఏ)కు సమర్పించాల్సి ఉంటుంది.
ఆ సంస్థల సూచనలు వచ్చిన తర్వాతే ఎలాంటి మరమ్మతులు చేయాలి, పునాది బలోపేతానికి ఏ చర్యలు అవసరం, భవిష్యత్తులో ఎంత మేర నీటి నిల్వలకు అనుమతి ఇవ్వాలి వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం 75 శాతం పరీక్షలు పూర్తయినా ప్రాజెక్టు పునరుద్ధరణకు ఇంకొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. భారీ వర్షాలు, గోదావరిలో వరదలు వస్తే నది మధ్యలో చేపట్టాల్సిన పరిశీలనలు తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.






