26 June, 2026 | 1:18 AM

మినరల్ మాఫియా..!

26-06-2026 12:02 AM

శంకర్‌పల్లిలో నిబంధనలు బేకాతరు.. అధికారుల నిర్లక్ష్యం

ల్యాబ్‌లు లేవు.. లవణాలు ఉండవు.. 

మురికి డబ్బాల్లోనే నీటి సరఫరా..

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

శంకర్‌పల్లి, జూన్ 25 (విజయక్రాంతి): జన నివాసాల్లో తాగునీటి అవసరాలను ఆసరాగా చేసుకుని శంకర్ పల్లి మున్సిపాలిటీతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో నకిలీ మినరల్ వాటర్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా వెలిసిన ఆర్వో ప్లాంట్లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ల్యాబ్ పరీక్షలు, అధునాతన శుద్ధి ప్రక్రియలు లేకపోగా.. కనీసం నీటి డబ్బాలను కూడా శుభ్రం చేయకుండా పురుగులు పట్టిన నీటిని సరఫరా చేస్తూ వ్యాపారులు కాసుల కక్కుర్తికి పాల్పడుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ దందాపై అధికారులు తూతూమంత్రంగా వ్యవహరిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలు తుంగలో.. రోగాల బారిన జనం...

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటర్ ప్లాంట్ నిర్వహించాలంటే అధునాతనమైన ల్యాబ్, హెవీ స్టేజ్ లైట్, ఆర్వోఐ, ఓజోనైజేషన్ వంటి సౌకర్యాలు ఉండాలి. కానీ, శంకర్ పల్లిలోని మెజారిటీ ప్లాంట్లు ఈ నియమాలను పూర్తిగా గాలికొదిలేశాయి. కొన్ని ప్లాంట్ల యాజమాన్యాలైతే బోరు బావుల నుంచి వచ్చే నీటిని నేరుగా ట్యాంకుల్లో నింపి ‘ప్యూరిఫైడ్ వాటర్’ పేరుతో మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రతిరోజూ ఆటోల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే వాటర్ టిన్నులను (డబ్బాలను) కనీసం కడగడం లేదు. ఫలితంగా నీటిలో పురుగులు, నాచు వస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ కలుషిత నీటిని తాగి పలువురు అస్వస్థతకు, రోగాల బారిన పడుతున్నారు. అయినా నీటి శుద్ధి ప్రక్రియ, వాడే రసాయనాలపై తనిఖీలు చేయాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ ఆఫీసులకూ మురికి నీరే...

స్థానిక మున్సిపల్ పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం ఈ ప్రమాణాలు లేని నీరే సరఫరా అవుతోంది. పైఅధికారులు మాత్రం బ్రాండెడ్ వాటర్ బాటిళ్లను వాడుతుండగా, కింది స్థాయి సిబ్బంది మాత్రం ఈ నాణ్యత లేని నీటిని తాగి అనారోగ్యాల పాలవుతున్నట్లు కార్యాలయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని హోటళ్లు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు ఈ కలుషిత నీటితోనే నడుస్తున్నాయి.

లవణాలు మాయం.. తనిఖీలు శూన్యం

వైద్యాధికారుల పర్యవేక్షణ, సూచనలు లేకపోవడంతో ఈ ప్లాంట్ల నీటిలో శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు (మినరల్స్) తగిన మోతాదులో ఉండటం లేదు. నిబంధనల ప్రకారం హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ప్లాంట్లపై ఆకస్మిక దాడులు చేసి, నీటి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపాలి. కానీ, ఇక్కడ అలాంటి నిఘా లోపించడంతో వ్యాపారుల ఇష్టారాజ్యం సాగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించిన ప్లాంట్లను సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

‘పట్టణంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిర్వహించాలన్నా, ఏ ఇతర దుకాణం పెట్టాలన్నా మున్సిపాలిటీ లేదా సంబంధిత గ్రామ పంచాయతీల నుంచి ఖచ్చితంగా వృత్తి వ్యాపార లైసెన్స్  తీసుకోవాలి. అలాగే నీటిలో లవణాల శాతం, ఫిల్టరేషన్ విధానాన్ని ఆర్డబ్ల్యూఎస్  అధికారులు తనిఖీ చేయాల్సి ఉంటుంది. శంకర్ పల్లిలో ప్రస్తుతం నడుస్తున్న వాటర్ ఫిల్టర్లకు ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న ప్లాంట్లపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.‘

 మున్సిపల్ కమిషనర్ యోగేష్