8 August, 2026 | 8:39 PM

సంస్కృతి వారధి సర్వజ్ఞ

08-08-2026 06:22 PM

రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు

ఖమ్మం ఎడ్యుకేషన్,(విజయక్రాంతి): ఖమ్మం పట్టణం విడిఒస్ కాలనీ నందు గల ప్రముఖ విద్యాసంస్థ సర్వజ్ఞ పాఠశాల యందు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే మహోత్తర పండుగ బోనాలను పురస్కరించుకొని బోనాల పండుగ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ప్రజలందరికీ తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు అనేది తెలంగాణ ప్రజల ఆరాధ్య దేవత గ్రామ దేవతలకు జరిపే పూజ. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను శాంతింపజేయడానికి, పంటలు బాగా పండాలని, పశు సంపద వృద్ధి చెందాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ పండుగను జరుపుకుంటారు.

పాఠశాల డైరెక్టర్ శ్రీ ఆర్.వి. నాగేంద్ర కుమార్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, "బోనాలు కేవలం పండుగ మాత్రమే కాదు, ఇదొక సామూహిక వేడుక. ఊరంతా కలిసి అమ్మవారిని కొలిచి, పల్లకి సేవలు, పోతరాజుల విన్యాసాలు, ఆడపడుచు నృత్యాలు,డప్పుల శబ్దాలతో సందడిగా జరుపుకుంటారు. ఇది ప్రజలలో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తుంది, మన తెలంగాణ సంస్కృతి, జీవన విధానం. అమ్మవారి ఆశీస్సులతో అందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాము. ఈ పండుగ మన సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది" అని పేర్కొన్నారు. 

అదేవిధంగా, పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి కె. నీలిమ గారు మాట్లాడుతూ, "బోనాల పండుగ భక్తి శ్రద్ధలకు, సామూహిక సంతోషానికి ప్రతీక. వర్షాలు కురవడం ప్రారంభమయ్యే ఆషాఢ మాసం ప్రారంభంలో ఈ పండుగ వస్తుంది. భక్తులు తమ కోరికలు తీరినందుకు లేదా తీరాలని కోరుతూ 'బోనం' (అంటే భోజనం) సిద్ధం చేసి, పసుపు, కుంకుమ, వేప కొమ్మలతో అలంకరించిన కుండలలో నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు.ఇది ప్రకృతితో మానవుడి సంబంధాన్ని, వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.

ఈ శుభదినం అందరి జీవితాల్లో ఐశ్వర్యాన్ని, విజయాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాము. సర్వజ్ఞ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఈ మహోన్నత పండుగ శుభాకాంక్షలు" అని తెలిపారు. సర్వజ్ఞ పాఠశాల విద్యార్థులకు విద్యతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పదనాన్ని తెలియజేయడానికి కట్టుబడి ఉందని, ఇటువంటి పండుగలు మన మూలాలను గుర్తుచేస్తాయని పాఠశాల యాజమాన్యం అభిప్రాయపడింది. బోనాల పండుగను అందరూ సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని సర్వజ్ఞ పాఠశాల కోరింది.