30 June, 2026 | 12:14 AM

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి

08-06-2024 12:05 AM

విజయక్రాంతి, ఖేల్ విభాగం అవకాశాల స్వర్గం అమెరికాకు.. ఉపాధి కోసం వలస వచ్చిన వారు కొందరైతే.. ఆ దేశంలో క్రికెట్ పెద్దగా ప్రాచూర్యం పొందకపోవడంతో.. జాతీయ జట్టులో అవకాశం దక్కించుకోవడం సులువు అని ఆ దిశగా అడుగు వేసిన వారు మరికొందరు. ఇలా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వారంతా కలిసికట్టుగా కదంతొక్కి టీ20 ప్రపంచకప్‌లో అతిపెద్ద సంచలనానికి తెరలేపారు.

ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టమైన పొట్టి ఫార్మాట్‌లో అమెరికా జట్టు అద్వితీయ ప్రదర్శన కనబరుస్తూ.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యంత నిలకడైన జట్లలో ఒకటైన పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అమెరికా సూపర్ ఓవర్‌లో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్‌పై సిరీస్ గెలిచి సత్తాచాటిన అమెరికా.. మెగాటోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించింది. మరొక్క విజయం సాధిస్తే చాలు.. సూపర్ ప్రధాన పోటీదారుల్లో యూఎస్‌ఏ ముందు వరుసలో నిలవనుంది.

ఇప్పటికే కెనడా, పాకిస్థాన్‌లపై విజయాలు సాధించిన అమెరికా ప్రస్తుతం గ్రూప్‌లో టాప్‌ప్లేస్‌లో కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌పై సిరీస్ విజయం గాలివాటం కాదని పాక్‌ను చిత్తుచేసి ప్రపంచానికి చాటిన అమెరికాతో ఇక ప్రత్యర్థులు జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే ఇది ఒక్కరోజులో సాధ్యమైంది మాత్రం కాదు. దీని వెనక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష ఉన్నాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్‌నే ఉదాహరణగా తీసుకుంటే.. అమెరికా తరఫున సత్తాచాటిన వారిలో అత్యధికులు భారతీయులే.

సౌరభ్ ‘సూపర్’ నేత్రవల్కార్

పాకిస్థాన్‌పై సూపర్ ఓవర్‌లో విజయం అనంతరం ప్రతి ఒక్కరూ సౌరభ్ నేత్రవల్కార్ గురించే చర్చిస్తున్నారు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, జైదేవ్ ఉనాద్కట్ వంటి టీమిండియా ప్లేయర్లతో కలిసి 2010లో అండర్ ప్రపంచకప్ ఆడిన సౌరభ్.. ఆ తర్వాత ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. ఒరాకిల్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కొలువు చేస్తూనే.. తనకిష్టమైన క్రికెట్ ప్రాక్టీస్ కొనసాగించాడు.

అంచలంచెలుగా ఎదుగుతూ జాతీయ జట్టుకు ఎంపికైన సౌరభ్.. పాకిస్థాన్‌తో సూపర్ ఓవర్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చాడు. బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తిఖార్ అహ్మద్ వంటి హిట్టర్లతో దట్టంగా ఉన్న పాకిస్థాన్ జట్టును సౌరభ్ తన పేస్‌తో కట్టిపడేశాడు.

పూర్తి కోటా 4 ఓవర్లలో కేవలం 18 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా సౌరభ్ స్వింగ్ బంతులను ఎదుర్కొనేందుకు బాబర్ సైతం తీవ్రంగా తడబడ్డాడు. ఇక మ్యాచ్ టైగా ముగియగా.. విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్‌లో సౌరభ్ అద్భుతమే చేశాడు. కట్టుదిట్టమైన బంతులతో క్రీడాలోకాన్ని తనవైపు తిప్పుకున్నాడు. 

అప్పుడలా.. ఇప్పుడిలా.. 

ముంబైలో పుట్టి పెరిగిన సౌరభ్ 2010 అండర్ ప్రపంచకప్‌లో యంగ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ టోర్నీలో పాకిస్థాన్‌తో పోరులో 5 ఓవర్లు వేసిన సౌరభ్ 16 పరుగలే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.

అయితే ఆ మ్యాచ్‌లో పాక్ చేతిలో భారత్ ఓటమి పాలవగా.. తాజాగా సౌరభ్ మరింత పదునైన బౌలింగ్‌తో పాక్‌ను కట్టడి చేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ప్రమాదకర రిజ్వాన్‌ను అతడు పెవిలియన్ బాట పట్టించాడు.

ఇక అక్కడి నుంచి పాక్ కోలుకోలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. నేత్రవల్కార్ ప్రదర్శనపై మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపించారు. ఈ జాబితాలో ఒకప్పుడు అతడితో కలిసి ఆడిన సూర్యకమార్ యాదవ్ కూడా ఉన్నాడు. 

అంతా మనవాళ్లే!

సౌరభ్ ఒక్కడే కాదు.. అమెరికా జట్టులో అగ్రభాగం భారతీయులే. పేసర్ హర్మీత్ సింగ్ ముంబైలో పుట్టి అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. జగ్‌దీప్ సింగ్ కూడా భారత సంతతి ఆటగాడే. ఇక కోరె అండర్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూజిలాండ్ జాతీయ జట్టు తరఫున ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అండర్సన్ ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికాకు వలస వచ్చి ఇక్కడ కూడా రాణిస్తున్నాడు.

అన్నింటికంటే ముఖ్యంగా పాకిస్థాన్‌పై అమెరికా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన యూఎస్‌ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్‌ది మన గుజరాతే. షాహీన్ షా అఫ్రిది, మహమ్మద్ అమీర్, నసీమ్ షా, హరీస్ రవుఫ్, షాదాబ్ ఖాన్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ అర్ధశతకంతో ఆకట్టుకున్న మోనాంక్.. భవిష్యత్తులో అమెరికాకు మరిన్ని విజయాలు అందించగలడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నితీశ్ కుమార్ కూడా భారత సంతతికి చెందిన ఆటగాడే కాగా.. మహమ్మద్ ఎహెసాన్ అలీ ఖాన్ పాకిస్థాన్‌లో పుట్టి పెరిగి.. ఆ జట్టుపైనే చక్కటి ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. ఇలా దండలోని వేర్వేరు పూసల్లా.. హారంలోని రకరకాల పూలలా.. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమెరికా తరఫున అదరగొట్టిన ఆటగాళ్లు.. ఇంకాస్త కష్టపడితే సూపర్ చేరడం పెద్ద కష్టం కాకపోవచ్చు!