29 June, 2026 | 11:20 PM

ఆస్ట్రేలియా x ఇంగ్లండ్

08-06-2024 12:36 AM

బ్రిడ్జ్‌టౌన్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. గ్రూప్ శనివారం బ్రిడ్జ్‌టౌన్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థులుగా పిలుచుకునే ఈ రెండు జట్లు అన్ని విభాగాల్లో సమంగా ఉండడంతో ఆసక్తికర పోరు ఖాయమే. ఇప్పటికే ఒమాన్‌తో మ్యాచ్ ద్వారా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేయగా.. స్కాట్లాండ్‌తో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో ఇంగ్లండ్ బోణీ చేయలేకపోయింది. తాజాగా ఆస్ట్రేలియాపై విజయంతో మెగా టోర్నీని ఘనంగా ఆరంభించాలని భావిస్తోంది. ఒమన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్, మార్కస్ స్టోయినిస్ మాత్రమే రాణించారు. ఈ ఇద్దరు నిలదొక్కుకొని ఆడడంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

ట్రేవిస్ హెడ్, కెప్టెన్ మిచెల్ మార్ష్, కామెరున్ గ్రీన్, మ్యాక్స్‌వెల్, మాథ్యూ వేడ్‌లు రాణించాల్సిన అవసరముంది. స్టార్క్, హాజిల్‌వుడ్, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్‌లతో పేస్ విభాగం పటిష్టంగా కనిపిస్తుండగా.. ఆడమ్ జంపా స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న కమిన్స్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశముంది. మరోవైపు ఇంగ్లండ్‌కు తొలి మ్యాచ్‌లో వరుణుడు అడ్డుపడినప్పటికీ బౌలింగ్ లోపాలు బయటపడ్డాయి. మార్క్‌వుడ్ పర్వాలేదనిపించగా.. ఆర్చర్, జోర్డాన్, రషీద్ పూర్తిగా విఫలమయ్యారు. మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఓపెనర్లు మున్సే, మైకల్ జోన్స్‌లు ఇంగ్లీష్ బౌలర్లపై యథేచ్చగా బ్యాట్ ఝళిపించారు. ఆసీస్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయకపోతే కష్టాలు తప్పవు. కెప్టెన్ జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, బెయిర్ స్టో, లివింగ్ స్టోన్, బ్రూక్, మోయిన్ అలీలతో బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది.